This village does not appear in Telangana ...

తెలంగాణలో ఈ గ్రామం కనిపించుట లేదు…

Date:25/01/2018

హైదరాబాద్:

తెలంగాణాలో ఓ గ్రామం మిస్సయింది. ఆ గ్రామం జాడ లేక ఏడాది దాటింది.. అది కూడ రాష్ట్ర రాజధానికి కూతవేటులో ఉన్న ఓ గ్రామం కావడం విశేషం. ఇప్పుడా గ్రామాన్ని వెతుక్కుంటూ అక్కడి ఎమ్మెల్యే, సర్పంచ్ సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు…అదేంటీ గ్రామం మిస్సవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ రియల్ స్టోరీ చూడండి…సూరారం గ్రామం తెలంగాణాలోని షాదనగర్ నియోజక వర్గంలోని ఓ చిన్న గ్రామం. ఈ ఊరిలోని ప్రజలంతా ప్రతి రోజూ తమ అవసరాల కోసం ఫారుక్ నగర్ అంటే షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రానికే వస్తుంటారు. అయితే ఈ గ్రామం ఏడాదిగా తప్పి పోయింది. మీరు వింటున్నది నిజమే తప్పిపోయింది ఎక్కడో కాదు, రెవెన్యూ రికార్డుల్లో మిస్సయింది.కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు అయ్యేంత వరకు ఈ ఊరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ మండలంలో ఉంది. కొత్త మండలాల ఏర్పాటు సమయంలో ప్రజల కోరిక మేరకు కొన్ని మార్పులు, చేర్పులు ప్రభుత్వం చేసింది. అయితే తాము ప్రతి రోజు పక్కనే ఫారుక్ నగర్‌కు వస్తుంటామని,తమ గ్రామాన్ని బాలానగర్ మండలం నుండి ఫారుక్ నగర్లో చేర్చాలని కోరారు సూరారం గ్రామ ప్రజలు.సూరారం గ్రామ ప్రజల కోరికను అంగీకరించిన రెవెన్యూ అధికారులు ఫారుక్ నగర్ మండలంలో చేర్చాలని నిర్ణయించారు. గతంలో ఫారుక్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇప్పడు ఈ మండలాన్ని రంగారెడ్డి జిల్లాలో చేర్చారు. అయితే బాలానగర్ నుండి తొలగిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ, ఫారుక్ నగర్ మండల గ్రామాల జాబితాలో చేర్చడం మర్చిపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల నోటిఫికేషన్లో ఈ గ్రామం గల్లంతయ్యింది. దీంతో రెవెన్యూ రికార్డుల్లో సూరారం ఏ మండలంలోనూ లేకుండా పోయింది. ఇది తెలియని గ్రామ ప్రజలు తాము కోరుకున్న విధంగా ఫారుక్ నగర్ మండలంలో చేరిపోయామని సంబరపడిపోయారు. రెవెన్యూ అధికారుల పొరపాటు తెలియని సూరారం గ్రామ ప్రజలు ఫారుక్ నగర్ మండల కార్యాలయానికి వెళ్లి తమకు కావాలిసిన ఏ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదు. మీ గ్రామం ఫారుక్ నగర్ మండలంలో చేర్చలేదని చెప్పడంతో ఆ గ్రామస్తులు షాక్ తిన్నారు. పోనీ, బాలానగర్లో అయినా ఉందేమోనని అక్కడి వెళితే అధికారులు మీ ఊరును మండలం జాబిత నుంచి తొలిగించామని చల్లగా చెప్పారట..చేసేదేమి లేక సూరారం గ్రామస్తులు షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్యను వేడుకుంటే ఆయన సెక్రటేరియట్లోని రెవెన్యూ అధికారులను సంప్రదించారు. జరిగిన తప్పును గుర్తించిన అధికారులు తాత్కాలికంగా మండలంలోని ప్రజలు, విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయాలని బాలానగర్ మండలం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. తర్వాత ఏమైందో ఏమో ఇప్పడు ఆ అధికారులు సర్టిపికెట్ల జారీని నిలిపివేశారు.. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయి కొత్త పాసు పుస్తకాల జారీకి రంగం సిద్ధమైంది. కానీ సూరారం గ్రామంలో రికార్డుల ప్రక్షాళన నిలిచిపోయింది. దీని ప్రకారమే ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల సహాయం అందించబోతున్నది. ఇవి తమ గ్రామానికి రావేమోనని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా సూరారం గ్రామంలోని విద్యార్ధులకు సర్టిఫికెట్లు ఎవ్వరూ ఇవ్వకపోడంతో చదువలు ఆగిపోయాయి. కొత్త మండలాలు, జిల్లాలు ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఇంత వరకు తాము ఏ మండలమో, ఏ జిల్లానో తెలియడం లేదని వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యను వెంటపెట్టుకొని స్థానికులు తమను ఏదో ఒక మండలంలో చేర్చాలని కొత్తగా వచ్చిన రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీని కలిసి వేడుకున్నారు.

Tags : This village does not appear in Telangana …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *