Natyam ad

శ్రీరామానుజాచార్యుల పుణ్యఫలమే తిరుపతి జన్మదినం -ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

– ఈ నెల 24న ఘనంగా తిరుపతి 892 వ జన్మదిన వేడుకలు…
– సమతామూర్తికి ప్రత్యేక పూజలు..
తిరుపతి
 
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పూజ్య  రామానుజాచార్యుల పుణ్యఫలంగా ఆవిర్భవించిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. చారిత్రక శాసన ఆధారాల ప్రకారం తిరుమల క్షేత్ర నిత్య సేవ కైంకర్యాలను నిర్దేశించిన శ్రీ రామానుజాచార్యులు… తిరుపతి పట్టణం ఆవిర్భవించడానికి నాంది పలికారని ఆయన ఉద్ఘాటించారు.120 సంవత్సరాలు జీవించిన శ్రీ రామానుజాచార్యులు…తన 112 ఏట అనగా 1130 ఫిబ్రవరి 24వ తేదీన తిరుపతిలోని గోవిందరాజస్వామివారిని ప్రతిష్టించి నాలుగు మాడ వీధులలో పునరుద్ధరించినట్టు తెలియజేశారు.ఆ సందర్భంగా ఆవిర్భవించిన గోవిందరాజపురమే నేటి తిరుపతి నగరానికి తొలి పేరు గా చారిత్రక ఆధారాలు చాటి చెబుతున్నాయన్నారు. అందుచేత అదే అదే రోజైన ఫిబ్రవరి 24 వ తేదీన తిరుపతి జన్మదినం నిర్వహించుకోవడం సముచితమన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24 వ తేదీన 892 వ పుట్టిన రోజు కావడం విశేషమని భూమన పేర్కొన్నారు. ఈ మహోన్నత సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 24వ తేదీన తిరుపతి జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని వెల్లడించారు. అదే రోజు ఉదయం 9.00 గంటలకు స్థానిక గోవిందరాజస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల సన్నిధి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆలయ చతుర్మాడ వీధుల్లో శ్రీరామనుజాచార్యుల చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతామని వివరించారు. భూమన కరుణాకర రెడ్డి స్థానిక సింధూరి హోటల్ లో మీడియా ప్రతినిధులతో తిరుపతి చారిత్రిక ఆధారాలను ప్రస్తావించారు. కపిల తీర్థం వద్ద ఉన్న చిన్న గ్రామాన్ని కొత్తూరు గా పిలిచేవారని, 1930లో అప్పటి పార్థసారధి స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి, అదేరోజు నాలుగు మాడ వీధులను అభివృద్ధి చేసి చేశారని వివరించారు.
 
 
అదేవిధంగా ప్రస్తుత రైల్వే స్టేషన్ వద్ద, భేరివేది, కృష్ణాపురం ఠాణా తోపాటు బండ్లవీధి వద్ద
(నాలుగుకాళ్ల మండపం) ఇలా నాలుగు మండపాలను నిర్మించి, వాటిల్లో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని భూమన వివరించారు.  రామానుజాచార్యలు ఏర్పాటుచేసిన గోవిందరాజ పురం 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతిగా ప్రసిద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యం తో పాటు ఘన చారిత్రక ఆధారాలు, సంసృతి ప్రపంచంలో రోమ్ నగరం తో సహా మరే ఇతర నగరాలకు లేదన్నారు.  రామానుజాచార్యులు శంకుస్థాపన చేసినట్టు మరే ఇతర నగరాల్లో జరగలేదని స్పష్టం చేశారు. ఆ దివ్య చరిత్రను ఆదునిక యుగాలకూ తెలియజేసే లక్ష్యంతో ఈనెల 24వ తేదీన తిరుపతి జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు భూమన పునరుద్ఘాటించారు. బాధ్యత కలిగిన పౌరులుగా తిరుపతి పుట్టిన రోజును విస్మరించడం తగదని, ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలన్న తలంపుతోనే తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ పాల్గొన్నారు.

Tags: Tirupati Birthday is the holy fruit of Sri Ramanujacharya – MLA Bhumana Karunakara Reddy