చేతివాటానికి చెక్ పడేదెన్నడు?

Date:17/06/2018
మెదక్ ముచ్చట్లు:
మెదక్ లో కార్పోరేషన్ లోని ఒప్పంద కార్మికుల శ్రమకు తగిన ఫలితం దక్కడంలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల వల్లే వీరి కష్టానికి తగిన వేతనం అందడం లేదని పలువురు అంటున్నారు. కార్మికులకు ఇచ్చే కొద్దిమొత్తంలోనే కొంత కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారని దీంతో బడుగులు దోపిడీకి గురవుతున్నారని చెప్తున్నారు. మెదక్‌ పురపాలక సంఘంలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లో 138 మంది కార్మికులు కాంట్రాక్ట్ పై పనిచేస్తున్నారు. వీరి నియామకానికి పురపాలక శాఖ టెండర్లు పిలిచారు. టెండర్లు దక్కించుకున్న వారే కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే ప్రతి కార్మికుడికి రూ.8,300 వేతనం చెల్లించాల్సి ఉంటుంది. మెదక్‌ పురపాలక సంఘంలో ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఒప్పంద కార్మికుల వేతనాలను వారే బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రతి కార్మికుడికి రూ.8,300 ఇవ్వాల్సి ఉండగా ఒక్కో కార్మికుడి నుంచి ప్రతినెలా రూ.500 వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.500 కమిషన్ చెల్లించిన వారికే కాంట్రాక్టర్లు నెలానెలా వేతనాలు ఖాతాల్లో జమ చేస్తున్నారని సమాచారం. తమకు అందే కొద్దిమొత్తంలోనే కమిషన్ ఇవ్వకపోతే విధుల నుంచి తొలగిస్తారన్న భయంతో పలువురు కార్మికులు ఉన్నారు. దీంతో తమ కష్టార్జీతంలో కొంత భాగాన్ని వారికి సమర్పించుకుంటున్నారు. ఈ విషయం పురపాలక శాఖ అధికారులకు తెలిసినా మౌనంగానే ఉంటున్నారు. పురపాలక ఖజానాలో నగదు నిల్వ లేకపోతే వేతనాల చెల్లింపుల్లో కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తున్నారు. ఫలితంగా కార్మికులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ప్రతినెలా కార్మికుడికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అయితే గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా నెలల తరబడి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి ఒప్పంద కార్మికులకు వేతనాలు ఇస్తున్నారు. ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మెదక్ లో మాత్రం కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి కార్మికులకు పూర్తిస్థాయిలో వేతనం దక్కేలా చర్యలు తీసుకోవాని అంతా కోరుతున్నారు.
Tags; To check for handwriting?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *