నేడు ఇండియన్ నేవీ డే!

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

భారతీయ నౌకాదళం శౌర్య ప్రతాపాలను ప్రజానీకం కళ్లెదుట నిలిపే విజయోత్సవ సంరంభమైన నావికా దినోత్సవం (నేవీ డే) సోమవారం ఉత్తేజకరంగా జరగనుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ వేడుకలలో భాగంగా ముఖ్యంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం వేదికగా నేవీ డే నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నేవీ డేను పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించిన వేడుకలకు పరాకాష్టగా సోమవారం సాగరతీరంలో సాహసోపేత, ఉత్కంఠభరిత, సాయుధ విన్యాసాలు నేత్రపర్వంగా జరగనున్నాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, హెలికాప్టర్లు, విమానాలు, అంతకు మించి నావికుల వీరోచిత కార్యక్రమాలతో నేవీ శక్తి సామర్ధ్యాలు ప్రదర్శితం కానున్నాయి. ఉదయాన్నే తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్‌అడ్మిరల్ సాగరతీరంలోని యుద్ధ వీరుల స్మారక చిహ్నం వద్ద ఘనంగా నివాళులర్పించడంతో నావికాదళ దినోత్సవం ప్రారంభం కానుంది. సాయుధ విన్యాసాలు నాలుగుగంటలకల్లా ప్రారంభం కానున్నాయి. సాయంసంధ్యలో విశాఖ సాగరతీరంలో పదిహేడు నావికా దళ యుద్ధ నౌకలు, ఎనిమిది యుద్ద విమానాలు, జలాంతర్గాములతో పాటు మెరైన్ డైవర్లు తమ ప్రావీణ్యాన్ని, సమర సామర్ధ్యాన్ని ప్రదర్శించనున్నారు. అందుకు తగిన విధంగా నావికాదళ బ్యాండ్ వాద్యకారులు ప్రజానీకాన్ని ఉత్తేజపరచనున్నారు. నేవీడే వేడుకలకు ముఖ్యఅతిధిగా పలువురు ప్రముఖులు రానున్నారని నావికాదళ వర్గాలు పేర్కొన్నాయి. వేడుకల ఏర్పాటుపై ఆదివారం ఐఎన్‌ఎస్ సహ్యాద్రిలో ఈఎన్‌సీ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ విన్యాసాల విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్స్, సిఓ, పలువురు ఫ్లాగ్ ఆఫీసర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tag : Today Indian Navy Day!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *