Today's bonfire

నేడు బోగ భాగ్యాల భోగి

-అజ్ఞానాంధకారాన్ని పారదోలాలి

-కోటికాంతులతో కొత్త ఉత్సాహం

Date: 14/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

సూర్యుడు ధనురాశిలో ఉండే చివరిరోజు భోగ భాగ్యాల భోగీ పండగ జరుపుకుంటాం. అజ్ఞానాంధకారాన్ని పారదోలి కోటికాంతులతో కొత్త ఉత్సాహాన్ని భోగి పండగ నింపుతుందని మన ప్రగాఢ నమ్మకం. పండగకు వారం, పదిరోజుల ముందు నుండే పేడతో తయారుచేసిన పిడకలు దండలుగా గుచ్చి భోగి రోజు తెల్లారక ముందే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త వస్త్రాలతో భోగీ మంటలు వెలిగిస్తాం. ఆమంటల్లో భోగిపిడకల దండలు పిల్లలు చేత వేయిస్తాం. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయం. ఇప్పటికీ చాలా పల్లెల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వుంది. భోగీ మంటలు వెతలు, వేదనలు బుగ్గిచేసి కోటికాంతులు వెదజల్లుతుందనే నమ్మకం. ముఖ్యంగా పిల్లల శ్రేయస్సును కాంక్షించే భోగీపండ్లు పిల్లలకు పోస్తారు. ధనుర్మాస ఆఖరి రోజు సందర్బంగా గోదాకల్యాణాలు చేస్తారు. ఇవన్నీ ఈ పండగ సందడులే. ముందుగా సేకరించుకున్న కర్రలు, పిడకలతో నగరాలు, పట్టణాలు, పల్లెల్లో పలు ప్రధాన కూడళ్లలో సాంప్రదాయంగా భోగీ మంటలు వేస్తారు. ఆ మంటల వెలుగుల్లో ఉత్సాహంగా కేరింతలు, ఆనందంగా అరుపులతో ప్రజల్ని మేల్కోల్పుతారు. ఆలా ప్రారంభమౌతుంది భోగీ పండగ సందడి. పండగకు అవసరమైన రేగుపండ్లు,చెరకు ముక్కలు, పచ్చిశెనగలు మహిళలు ముందుగానే మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసుకుంటారు. చిన్నపిల్లలకు దిష్టిపోయి భగవంతుని దీవెనలు పుష్కలంగా లభించాలని భోగీపండ్లు పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో రకరకాల లక్కవస్తువులు, ఇతర ఆటవస్తువులు అందంగా ఆకర్షనీయంగా అమర్చి బొమ్మలకొలువులు ఏర్పాటు చేస్తారు. ఈవేడుకలకు ఇండ్లకు చుట్టు పక్కల వున్న ముత్తయిదువులను అతిధులుగా ఆహ్వానించి శెనగలు, అరటిపండ్లు, ఆకు వక్కా వాయనాలు సమర్పించుకుంటారు. తిరుష్టవై ప్రవచనం పూర్తియిన సందర్భంగా భోగీ నాడు వైష్ణవ దేవాలయాల్లో గోదారంగనాధుల కల్యాణం పలు ప్రాంతాల్లో వైభవంగా నిర్వహిస్తారు. ఇన్ని ప్రాముఖ్యతలతో సంతరించుకుని భోగభాగ్యాలతో సిరిసంపదలతో తులతూగుతూ హాయిగా ఆనందంగా జరుపుకునే భోగీపండగ నేడు. హిందువులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే పండగల్లో ప్రధానమైన సంక్రాంతి పండగ వచ్చేసింది. కరువు కాటకాలు ఎన్ని ఎదురైనా, ఆర్ధిక ఇబ్బందులు వెన్నంటే వున్నా, పండగ అంటే దండగ అని ఎంతమంది చెబుతున్నా అంతా పెద్ద పండగగా భావించే సంక్రాంతి ఆనందోత్సాహాల నడుమ జరుపుకునేందుకు పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. సుదూర ప్రాంతాల్లో వున్న వారు అష్టకష్టాలకు ఎదురేగి మరీ తమ సొంత ఊళ్ళకు చేరుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా నెల రోజుల క్రితమే ప్రారంభమైన పండగ సందడి రానురాను జిల్లా కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బొబ్బిలి, సాలూరు, ఎస్‌.కోట, పార్వతీపురం వంటి పట్టణ కేంద్రాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ… అనువైన ధర, నాణ్యమైన వస్త్రాల లభ్యతను ఆశించేటి అధిక శాతం మంది జిల్లా కేంద్రాన్ని ఆశ్రయించడం పరిపాటి. ఆక్రమంలోనే ఇటు కిరాణా, ఫ్యాన్సీ అటు వస్త్ర దుకాణాలతో పాటు ప్రతీ వ్యాపార కేంద్రం కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండగకు అంతా కీలకంగా భావించే వస్త్ర కొనుగోళ్లు గతంతో పోలిస్తే ఈ ఏడాది మరింతగా పెరిగాయని చెప్పక తప్పదు. అటు చిన్న,పెద్ద వస్త్ర దుకాణాలతో పాటు ఫుట్‌పాత్‌ వ్యాపారాలు కూడా అంతే పెద్ద ఎత్తున సాగుతుండడాన్నే ఇందుకు తార్కాణంగా చెప్పవచ్చు.దీనినే అలుసుగా తీసకుంటున్న కొంత మంది వ్యాపారస్తులు దొరికినంత దోచుకుంటున్నారు. నెలల పిల్లల దుస్తులు సైతం రూ.300 పైబడిన ధర పలుకుతుండడం, పండగ రానే వచ్చింది కదా అని భావించే చాలమంది అధిక ధరను లెక్కచేయకపోవడం వెరసి ఫుట్‌పాత్‌ వ్యాపారాలు సైతం మూడు పువ్వులు-ఆరు కాయల్లా సాగుతోంది. ఇక ప్రయాణాల విషయానికి వస్తే దూరాభార ప్రాంతాల నుండి సొంత వూళ్లకు వచ్చే క్రమంలో ప్రయాణీకులు అష్టకష్టాలు పడి రావడం అనివార్యమైంది. రైలు ప్రయాణం విషయానికి వస్తే రెండు నెలల క్రితం రిజర్వేషన్‌ చేయించుకున్న వారు సైతం సుఖ ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొందని ఆయా సందర్భాలు స్పష్టం చేస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుండి పయనమయ్యే ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో సైతం అదనపు భోగీల సంఖ్య పెంచకపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. మొత్తం మీద అష్టకష్టాలు పడైనా సంక్రాంతి పండగకు సొంతూరు చేరుకుంటున్నారు. ఫలితంగా పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా సర్వత్రా పండగ వాతావరణం నెలకొంది.

Tags: Today’s bonfire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *