మరుగుదొడ్ల నిర్వహణ. వివాదం.
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించే ప్రజా మరుగుదొడ్ల వద్ద రుసుం వసూలుకు వార్డు సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులను నియమిస్తూ మున్సిపల్ అదనపు కమిషనర్ నిరంజన్‌రెడ్డి జారీ చేసిన సర్కులర్ ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. గుంటూరులోని ఐదుచోట్ల ఉన్న మరుగుదొడ్ల నిర్వహణకు గతంలో ఉన్న కాంట్రాక్టు సంస్థ గడువు తీరడంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు న్యాయపరమైన చిక్కులు ఉండడం వల్ల నేరుగా సచివాలయాల ఉద్యోగులను మూడు సిఫ్టులుగా ఇక్కడ పనిచేయాలని అదనపు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ విధులు నిర్వహించాలని ఆదేశించారు. రుసుం వసూలుపై పర్యవేక్షణ బాధ్యతలను మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు కేటాయించారు. గుంటూరులోని గాంధీ పార్కు, బండ్ల బజారు, కృష్ణాపిక్చర్ ప్యాలెస్, ఎన్టిఆర్ బస్టాండ్, కొల్లి శారదా మార్కెట్ తదితర ప్రదేశాల్లో ఉన్న మరుగుదొడ్లకు ఒక్కో చోట ముగ్గురు వార్డు కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరి విధులను పర్యవేక్షించేందుకుఆయా ప్రాంతాల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించారు. అంతేగాక ఒక్కో వార్డు కార్యదర్శి ఎంత రుసుము వసూలు చేయాలో లక్ష్యం కూడా నిర్దేశించారు. గాంధీ పార్కు వద్ద రోజుకు రూ.ఐదు వేలు, బండ్ల బజారులో రోజుకురూ.300, కృష్ణాపిక్చర్ ప్యాలెస్ వద్ద రోజుకురూ.400, ఎన్టిఆర్ బస్టాండ్ వద్ద రోజుకురూ.1,000, కొల్లి శారదామార్కెట్ వద్ద రూ.2000 వసూలు చేయాలని నిర్దేశించారు. ఈ ఉత్తర్వులపై సచివాలయ ఉద్యోగులు భగ్టుముంటున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మంగళవారం సాయంత్రం అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. రుసుము వసూలు బాధ్యత పారిశుధ్య కార్మికులదని, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శి పర్యవేక్షణ చేయాలని సూచించామని పేర్కొన్నారు. దీనిపై మళ్లీ మరో సర్క్యులర్ ఇస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వం ఇలాగేనా చూసేది అని సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు ప్రశ్నించారు. అధికారులు సచివాలయ ఉద్యోగులను చాలా చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:Toilet maintenance. Dispute