వేటగాళ్ల ఉచ్చు

Date:13/02/2018
ఖమ్మం ముచ్చట్లు:
వేటగాళ్ల ఉచ్చులకు వన్యప్రాణులు హతమవుతున్నాయి. ఉచ్చులు, విద్యుత్‌ తీగలతో ముట్టబెడుతుండటంతో వాటి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. దాహార్తి తీర్చుకునే సమయంలో మాటు వేసి జంతువులను వేటగాళ్లు చంపేస్తున్నారు. దుప్పులు, కణుజుల మాంసాన్ని విక్రయిస్తుండగా, పులుల వంటి క్రూరమృగాల గోర్లు, చర్మాన్ని వేరు చేసి అమ్ముకుంటున్నారు. రెండేళ్ల క్రితం నీళ్లల్లో విషయం కలిపి చిరుతలను హతమార్చిన తీరు చంద్రుగొండ మండలంలో సంచలనం సృష్టించింది. అప్పట్లో వేటగాళ్లు వాటి కాళ్లను వేరు చేయడం భీతి గొల్పింది.23 మండలాలున్న జిల్లాలో అటవీ ప్రాంతాలు ఎక్కువ. గతంలో జిల్లాలో దట్టమైన అడవులుండేవి. కానీ రానురాను అడవులు కాస్త పల్చబడుతున్నాయి. ఈనేపథ్యంలో జంతువులకు రక్షణ లేకుండా పోతోంది. వేటగాళ్లు జంతువుల పాదముద్రల ఆధారంగా వాటిని హతమార్చుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కుంటలు, వాగుల పరిసరాల్లోకి వచ్చే ప్రాంతాల్లో ఉచ్చులు, విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేసి చంపేస్తున్నారు. కంటికి కన్పించినంత సన్నసన్న తీగలను వేటకు ఉపయోగిస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ వంటి పట్టణాల్లో జంతువుల మాంసం విక్రయిస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు వేటగాళ్లకున్నంత డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఫోన్‌లలోనే మాంసం ఆర్డర్లు స్వీకరించి.. చెప్పిన చోటకు కణుజు, దుప్పుల మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా కొంత స్థోమత ఉన్నవాళ్లు జంతుమాంసం కోసం ఎంతైనా వెచ్చించేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది.జిల్లాలోని 493 బీట్ల పరిధిలో గత నెలలో అటవీశాఖాధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. జంతువుల గణాంకాలను సేకరించారు. గత నెల 22నుంచి 24 వరకు మాంసాహార జంతువులు, 27నుంచి 29 వరకు శాఖాహార జంతువుల గణాంకాలను సేకరించారు. జిల్లాలో 1500 మంది అటవీశాఖాధికారులు, సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. జిల్లాలో కొండ గొర్రెలు 658, చుక్కల దుప్పులు 4,278, అడవిదున్నలు తొమ్మిది, ఎలుగుబట్లు 11, అడవీ పిల్లులు 674, కణుజులు 28 ఉన్నట్లు సర్వేలో తేలింది. చంద్రుగొండ అటవీ రేంజ్‌ పరిధిలోని రావికంపాడు, మద్దుకూరు, అన్నపురెడ్డిపల్లి సెక్షన్ల పరిదిలోని పది బీట్లల్లో అడవి బర్రెలు, దుప్పులు, కొండగోర్రెలు, కణుజులు, ఎలుగుబట్లు, కుందేళ్లు, నక్కలు, అడవిపందులు ఉన్నట్లు తేలింది.జంతువుల వేటకు సంబంధించి కొన్ని విషయాలే బయటకు వస్తున్నాయి. వేటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడో, పంపకాల్లో తేడా వచ్చినప్పుడో, మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినప్పుడో విషయం వెలుగులోకి వస్తోంది. వెలుగుచూసిన విషయాల ఆధారంగానే అటవీశాఖాధికారులు చనిపోయిన ప్రాణుల సంఖ్యను లెక్కిస్తుండటం నివ్వెరపరుస్తోంది. అటవీశాఖలో కొందరు అధికారులు వేటగాళ్లతో అంటకాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలంలోని గుట్టలు, పెనుబల్లి మండలంలో నీలాద్రి ఆలయ పరిసరాలు, లంకాసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో అటవీ ప్రాంతం. కల్లూరు నుంచి చంద్రుగొండకు వెళ్లే కనకగిరి గుట్టలు, అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం, తిరుమలకుంట, ఆసుపాక, అచుతాపురం, దమ్మపేట మండలంలోని ఆర్లపెంట, దుర్గమ్మ గట్టు, పట్వారీగూడెం అటవీ ప్రాంతం, చంద్రుగొండ మండలంలోని అబ్బుగూడెం, తిప్పనపల్లి, ములకలపల్లి మండలం, పాల్వంచ మండలంలోని మొ ండిగుట్ట, చంద్రాలగూడెం, ఉల్వనూరు, కి న్నెరసాని అభయారణ్య పరిసర ప్రాంతాల్లో వేటగాళ్లు వన్యప్రాణులను హతమార్చుతున్నారు.వన్యప్రాణులు అంతరించడానికి ప్రధాన కారణం అడవులు తగ్గిపోవడమే. పోడు సాగు అడవులకు శరాఘాతంగా పరిణమించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2000 కంటే ముందు అధికారికంగా 7407 హెక్టార్ల అడవి ఆక్రమణకు గురైంది. 2001-05 వరకు 144 హెక్టార్లు ఆక్రమణకు గురైంది. ఈ ప్రకారం చూసుకుంటే ఆ అడవి పరిధిలో నివసించే వన్యప్రాణులు దాదాపు అంతరించినట్టే లెక్క.వన్యప్రాణులను హతమార్చుతున్న వేటగాళ్లపై కేసులు నమోదు చేసేందుకు అటవీ శాఖకు ప్రత్యేకంగా నిధులు లేవు. ప్రభుత్వం మంజూరు చేయకపోవడమే ఇందుకు కారణం. ఒకవేళ కేసులు నమోదు చేస్తే స్టే షనరీ, డాక్టర్‌ ఫీజు, కోర్టు నుంచి జైలుకు, జైలు నుంచి కోర్టుకు, మధ్యలో భోజనాల ఖర్చు సుమారు రూ. రెండు నుంచి మూడు వేల వరకు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. వీటిని తామే భరిస్తున్నామని చెబుతున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా చెట్లను నరికేస్తున్నారు. జంతువులను వేటాడుతున్నారు.ఏటా వందల సంఖ్యలో వన్యప్రాణులు చనిపోతే అధికారులు పదుల సంఖ్యలో చూపుతున్నారు. దుప్పులు, అడవి పందులు, నెమళ్ల వందల సంఖ్యలో చనిపోతుంటే అధికారులకు కన్పించడం లేదు. వేటగాళ్లు దుప్పుల మాంసాన్ని, చర్మాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పులిగోర్లు, చర్మం, నెమలి పింఛాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు నిఽధులు లేకపోవడంతో కేసులు నమోదు చేయడం లేదని అధికారులు చెప్పే సమాధానం హతాశులను చేస్తోంది. 2009-16 అంటే ఏడేళ్ల కాలంలో 24 కేసులు నమోదు చేశారు. 2009-10లో ఆరు, 2010-11లో ఆరు, 2011-12లో నాలుగు, 2015-16లో 12, 2017-18లో పది కేసులు నమోదు చేశారు.వైల్డ్‌లైఫ్‌ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడితే నాన్‌బేయిలబుల్‌ కేసులు నమోదు చేస్తారు. ఈ చట్టంలో అండర్‌ సెక్షన్‌-9 ప్రకారం అడవి జంతువుల వేట, వాటిని బెదిరించడం, హింసించడం, వాటికి ఎలాంటి అపాయం తలపెట్టినా మూడు నుంచి ఏడేళ్ల వరకు కారాగార శిక్ష విధిస్తారు. శిక్షతో పాటు అపరాధ రుసుం వసూలు చేస్తారు. కేసు తీవ్రతను బట్టి శిక్ష, అపరాధ రుసుం ఎక్కువగానే ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ఎక్కువగా కేసులు నమోదు చేయడం లేదు.
Tags: Trap hunters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *