భారత గాన కోకిల లతా మంగేష్కర్ మృతికి టిటిడి చైర్మన్, ఈవో సంతాపం

తిరుమల ముచ్చట్లు:
 
భారతరత్న అవార్డు గ్రహీత, భారత గాన కోకిలగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయకురాలు కుమారి లతా మంగేష్కర్ మృతికి టిటిడి ఛైర్మన్   వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఎనిమిది దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కుమారి లతా మంగేష్కర్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి కుమారి లతా మంగేష్కర్ అందించిన గానకైంకర్యాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అన్నమయ్య రచించిన 10 సంస్కృత సంకీర్తనలను 2010వ సంవత్సరంలో కుమారి లతా మంగేష్కర్ హిందుస్థానీ బాణీలో గానం చేశారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఈ సంకీర్తనలను రికార్డు చేసి అన్నమయ్య స్వర లతార్చన పేరుతో సిడిని రూపొందించి భక్త లోకానికి అందించింది. ఇందులో గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా, తిరుపతి వేంకటేశ్వర గోవిందా… అనే పల్లవితో సాగే సంకీర్తనకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. ఈ సంకీర్తన నేటికీ భక్తలోకాన్ని అలరిస్తోంది. కుమారి లతా మంగేష్కర్ శ్రీవారి ఆస్థాన విదుషీమణి(సంగీత విద్వాంసురాలు)గా కూడా సేవలందించారు.
 
Tags: TTD Chairman, Evo mourns the death of Indian singer Kokila Lata Mangeshkar

Natyam ad