మహిళలకు మేలు చేయనున్న ఉజ్వల్‌ యోజన

Date:14/04/2018
మహబూబ్‌నగర్ ముచ్చట్లు:
ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజనతో వంట గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గణనీయమైన మేలు జరగనుంది. కట్టెల పొయ్యిపైనే ఇప్పటికీ వంట చేసుకునే వారికి ఇకపై ఆ సమస్య తీరనుంది. ఇదిలాఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ పథకం ద్వారా 1,42,494 కుటుంబాలకు  ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు లబ్ధిదారులను గుర్తించి, వారికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షను అందించనున్నారు. గ్యాస్ కనెక్షన్ కోసం లబ్ధిదారులు పైసా చెల్లించాల్సిన పని లేదు. ప్రతి కనెక్షనుకు రూ.1,600 మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇతర జిల్లాలతో పొల్చుకుంటే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎల్‌పీజీ కనెక్షన్లు తక్కువగా ఉన్నాయి. అటవీ ప్రాంతం, గిరిజన కుటుంబాలు ఎక్కువగా ఉండటం,  పేదరికం, నిరక్షరాస్యత లాంటి కారాణాలతో స్థానికంగా వంట గ్యాస్ వినియోగం తక్కువగా ఉంది. అనేక కుటుంబాలు కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో సిలిండరు వినియోగంలో గృహిణులు వెనుకబడి ఉన్నారు. కట్టెల పొయ్యిపై వంట చేయడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా ఈ సమస్యలకు ఇకమీదట చెక్ పడనుంది. గ్యాస్ కనెక్షన్ కోసం లబ్ధిదారుల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పనిలేదు. గ్యాస్‌ ఏజెన్సీలే గ్రామాలు, పట్టణాలు, అటవీ ప్రాంతాలు, గూడేల్లోని ఇళ్ల వద్దకు వచ్చి వివరాలు సేకరిస్తాయి. గ్యాస్‌ కనెక్షను లేనివారి వివరాలను సేకరిస్తారు. ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద అర్హులైతే వారికి త్వరితగతిన ఉచితంగా గ్యాస్‌ కనెక్షను అందిస్తారు.  స్టవ్‌, ఇతర పరికరాలను కూడా ఎలాంటి రుసుము తీసుకోకుండా ఇస్తారు. సిలిండర్ కనెక్షన్ ఉచితంగానే ఇచ్చినా స్టవ్‌ తదితరాల మొత్తాన్ని రెండో ఏడాది నుంచి రీఫిల్‌కు ఇచ్చే రాయితీల నుంచి మినహాయిస్తారు. ఈ బాకీ తీరగానే.. మళ్లీ రాయితీని అందిస్తారు.  ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ కుటుంబాలు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగి ఉన్నవారు, తేయాకు తోటల్లో పనిచేసే కుటుంబాలు, నదీతీరాన, దీవుల్లో నివసించేవారు, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉన్నవారిని ఈ పథకానికి అర్హులు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి 8,04,070 ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 1,42,494 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు కావాల్సి ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని లక్షల మంది మహిళలకు కట్టెల పొయ్యి కష్టాలు తీరనున్నాయి.
Tags: Ujala Yojana is good for women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *