కనిపించని ‘చిరు’ మెరుపులు

Date:14/02/2018
కృష్ణా ముచ్చట్లు:
తెరపై ఏ పాత్రనైనా తనదైన స్టైల్ తో పండించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే రాజకీయవేత్తగా.. నిజజీవితంలో మాత్రం కొంత స్లో అయిపోయారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సామాజిక న్యాయం అంటూ హల్ చల్ రేపిన చిరు.. తర్వాత తమ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. హస్తం పార్టీ తరపున అయినా పాలిటిక్స్ లో చురుగ్గా మారతారనుకున్న వారికి నిరాశే మిగిలింది. రాజ్యసభ సభ్యుడిగా తొలుత యాక్టివ్ గానే ఉన్న మెగాస్టార్ ప్రస్తుతం పొలిటికల్ గా లైమ్ లైట్ లో లేకుండా పోయారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో చిరు కనిపించలేదు. బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై ఏపీ ఎంపీలు ఉభయ సభలను స్తంభింపజేసినా ఆయన మాత్రం.. పార్లమెంట్ లొకాలిటీలోనే కనిపించలేదు. తెలంగాణ ఎంపీలు కూడా ఆంధ్ర వాదనలో న్యాయం ఉందంటూ మద్దతుగా నిలిచారు. పొరుగురాష్ట్రమే ఆంధ్రకు నిలబడితే.. అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి.. సభలో లేకపోవడం చర్చనీయాంశమైంది. చిరు ఎక్కడ అంటూ సినీ-రాజకీయ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. పార్లమెంట్ లో కీలకమైన సమావేశానికి హాజరుకాకుండా ఆయన ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా తనకు ప్రాధాన్యత లభిస్తుందని భావించారు చిరంజీవి. అయితే కాంగ్రెస్ ఓ మహాసముద్రం. అనేకమంది సీనియర్లకు ఆలవాలం. అలాంటి పార్టీలో చిరుకు ఆశించినంత ఇంపార్టెన్స్ లభించలేదు. ఇక రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మూటగట్టుకున్న ప్రజా వ్యతిరేకత అంతాఇంతాకాదు. ఇలాంటివన్నీ రాజకీయంగా చిరుకు పెద్దగా ప్లస్ కాలేదు. ప్రస్తుతం చిరు కాంగ్రెస్ నేతే. అయితే.. ఆ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్తే.. మద్దతుకు బదులు.. మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పై ప్రజలకు పెద్దగా విశ్వాసం లేదు. ఆదరణ అంతకన్నా లేదు. అందుకే పార్టీ తరపున సాగుతున్న కార్యక్రమాలను చిరు సీరియస్ గా తీసుకోవడంలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతగా ప్రజల్లో మరీ ఫోకస్ అయితే.. సినీకెరీర్ కూడా కొంత ప్రభావితమవుతుందని చిరు భావిస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది. ఇందులోనూ  వాస్తవం ఉండొచ్చు. మెగాస్టార్ రాజకీయ మౌనానికి జనసేన పార్టీతో తమ్ముడు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడమే కారణమని మరికొందరు భావిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం అన్న గారిని ఆకాశానికి ఎత్తేశారు. చిరంజీవి అమాయకుడు అంటూ ఆయనలా తాను మోసపోనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరిశీలించిన కొందరు అన్నదమ్ముల మధ్య అండర్ స్టాండింగ్ వుండే వ్యవహారం నడుస్తున్నట్లు కూడా భావిస్తున్నారు. కారణలేమైనా పార్లమెంట్ సమావేశాలకు చిరు గైర్హాజరవడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం తరపున మాట్లాడాల్సిన నేత సభలకు దూరంగా ఉండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
Tags: Unappeared ‘little’ lightning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *