సర్కారీ ఆస్ప్రతుల్లో నిరుపయోగంగా ఫిజియోధెరఫి మిషన్లు

కడప ముచ్చట్లు:
 
ప్రభుత్వ ఆస్పత్రులో ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ యంత్రాలు అందుబాటులో ఉన్నా వాటిని వినియోగించే పరిస్థితి మచ్చుకైనా కనిపించడంలేదు. వాటి ద్వారా సేవలందించే నిపుణులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. లక్షలు వెచ్చించి కొన్న యంత్రాలు పని లేకపోవడంతో మూలన చేరుతున్న వైనం జిల్లాలో కనిపిస్తోంది. ప్రభుత్వం వైద్యులను నియమించకపోవడంతో పరిస్థితి తలెత్తుతోంది. పేదలకు ఈ సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ఎముకల బెనుకులు, విరుపులు కండరాల నొప్పులు, మోకాళ్ల నొప్పులుతో బాధపడే రోగులకు ఉపశమనం కలిగించడానికి వీలుగా ఫిజియోథెరపీ వైద్యాన్ని రోగులు ఆశ్రయిస్తారు. ఈ సేవలను అందించడానికి వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ పరికరాలు, యంత్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటికోసం దాదాపు రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షలు దాకా వెచ్చించారు. వీటిని నిర్వహించడానికి ప్రత్యేకంగా ఫిజియోథెరపీలో నైపుణ్యం కలిగిన వైద్యులను నియమించాలి. ప్రభుత్వం యంత్రాలనైతే ఏర్పాటు చేసింది కాని వైద్యుల ఏర్పాటు అంశాన్ని పూర్తిగా విస్మరించింది. గత సంవత్సరమే వైద్యులను నియమించడానికి కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ ఫలించలేదు. వైద్యులు లేకపోవడంతో యంత్రాలను నిర్వహించే నాథుడు కరువవుతున్నారు. పరికరాలు అందుబాటులో ఉన్నా పని జరగడం లేదు. రూ. లక్షలు విలువ చేసే పరికరాలు మూలన చేరుతున్నాయి.ప్రభుత్వాసుపత్రుల్లో ఫిజియోథెరపి సేవలు పేదలకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. చాలా మంది పేదలు ఆస్పత్రులకు ఈ సేవలను పొందడానికి వస్తుంటారు. వచ్చిన వారికి సేవలు అందడంలేదని తెలిసి ఉస్సురుమంటున్నారు. ఇక్కడ సేవలు అందకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. వీటిలో ఈ సేవలను పొందడానికి దాదాపు రోజుకు 350 నుంచి రూ. 500 వరకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు ఇది ఏమాత్ర్రం సాధ్యపడడం లేదు. ఒకింత ఆర్థిక స్థోమత కలిగిన వారు మాత్రమే ప్రయివేటు ఆస్పత్రులకు వెలుతున్నారు. ఆ స్థోమత లేనివారు బాధలను దిగమింగుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వైద్యులను నియమించి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
 
Tags: Useless physiotherapy missions in government hospitals

Natyam ad