Utilization of compa funds for forest protection

అడవుల సంరక్షణకు  కంపా నిధుల వినియోగం

Date:18/06/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
కంపా నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ అటవీకరణ పనులు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, మరింతగా పనిచేసి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు విడుదల అయ్యేలా చూసుకోవాలని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి సూచించారు.  ప్రత్యామ్నాయ అటవీ పెంపకం, నిధుల నిర్వహణ, ప్రణాళిక సంస్థ నాలుగవ స్టీరింగ్ కమిటీ సమావేశం చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. కంపా నిధుల వినియోగం, గత యేడాది చేపట్టిన పనులు, పురోగతిపై సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో 125 కోట్ల కంపా నిధులు మంజూరు కాగా, 137 కోట్ల మేర పనులను అటవీ శాఖ చేపట్టింది. ఈ యేడాది కోసం 595 కోట్ల నిధుల విడుదలకు కేంద్రాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఈయేడాది నుంచి ప్రత్యామ్నాయ అటవీ పెంపకం పనులు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 150 కోట్లను ప్రత్యేకంగా అడగనున్నారు. ఇక పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అడవుల రక్షణ చర్యల కోసం మరో 220 కోట్ల రూపాయలను, ఇతర ప్రాంతాలు, వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన పనుల కోసం ప్రతీ యేటా ఇచ్చే నిధులను 225 కోట్లకు పెంచాల్సిందిగా కోరాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు స్టీరింగ్ కమిటీ తీర్మానించింది. మొత్తంగా 595 కోట్లను కంపా పథకం కింద రాబట్టుకొనేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. కంపా నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భారీగా చేపట్టనున్న ప్రత్యామ్నాయ అటవీకరణ, మొక్కల పెంపకం విసృతంగా జరగాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. ఆయా ప్రాంతాల్లో భూసారం, నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాతే, అనువైన వాతవరణం ఉన్న రకాల మొక్కలనే పెంచటం ద్వారా,  చెట్లు బతికే శాతాన్ని పెంచవచ్చని సూచించారు.  కంపా నిధులతో చేపట్టిన పనులు, ఫలితాల ఆడిట్ కూడా సమర్థవంగా ఉండాలన్నారు.  అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు ఇప్పటికీ వంట చెరుకుకోసం అడవిపైనే ఆధారపడుతున్నారని, అందువల్ల అడవుల క్షీణతపై ప్రభావం పడుతోందని, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అందిస్తున్న గ్యాస్ కనెక్షన్లను వీరికీ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రాజెక్టులు, అటవీ ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఏమేరకు ఉంచి, పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై జయశంకర్ యూనివర్సిటీతో కలిసి అధ్యయనం చేయాలని కూడా సమావేశం తీర్మానించింది.
సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు,  అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ ) పీ.కె.ఝా, కేంద్ర పర్యావరణ శాఖ ప్రతినిధి రాజ గోపాల్ రెడ్డి, పర్యావరణ నిపుణుడు డాక్టర్ వాసుదేవరావు, అదనపు అటవీ సంరక్షణ అధికారులు లోకేష్ జైస్వాల్, ఆర్. శోభ పాల్గొన్నారు.
Tags:Utilization of compa funds for forest protection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *