Visakhapatnam police arrested in Rajasthan

రాజస్థాన్లో విశాఖ పోలీసుల అరెస్ట్.. దొరకని బెయిల్

Date: 12/12/2017
రాజస్తాన్ ముచ్చట్లు:
నగరంలో జరిగిన ఒక దోపిడీ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు రాజస్థాన్ వెళ్లి అక్కడ ఏసీబీ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లిన నగర పోలీసులకు బెయిల్ రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు రాజస్థాన్లో పడిగాపులు కాస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన నగల వ్యాపారి మూడు కిలోల బంగారాన్ని తీసుకుని ఈ ఏడాది ఆగస్టు 28న మధురవాడ క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్కు రాగా, రాజస్థాన్కు చెందిన రాకేష్కుమార్ ఆ వ్యాపారిని బంధించి దోపిడీ చేసి పరారైపోయాడు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా నార్త్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ ఆవీఆర్కే చౌదరి, పరవాడ క్రైమ్ ఎస్ఐ ఎస్కే షరీఫ్, మహారాణిపేట క్రైమ్ ఎస్ఐ గోపాలరావు, వన్టౌన్ క్రైమ్ విభాగం కానిస్టేబుల్ హరిప్రసాద్ గతనెలలో రాజస్థాన్ వెళ్లారు.అక్కడ కొంతకాలం మాటువేసిన తర్వాత ప్రధాన నిందితుడైన రాకేష్కుమార్ను ఎట్టకేలకు పట్టుకోగలిగారు. అతనితో పాటు దోపిడీకి పాల్పడిన మరి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రెండు కిలోల వరకూ బంగారాన్ని రికవరీ చేశారు. మిగిలిన బంగారం రికవరీ కోసం ప్రయత్నిస్తుండగా కొంతమంది నిందితుల పేర్లను కేసు నుంచి తప్పించేందుకు రూ.1.60 లక్షలు లంచం డిమాండ్ చేశారంటూ నిందితుల్లో ఒకరు అక్కడ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు గత నెల ఆరున నిందితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా, నలుగురు పోలీసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో డీజీపీ సాంబశివరావు స్వయంగా జోక్యం చేసుకుని అక్కడ డీజీపీతో మాట్లాడారు. అంతేగాకుండా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ నగర పోలీస్ కమిషనర్ యోగానంద్కు సూచించారు. దీంతో క్రైమ్ డీసీపీ షిమోషిబాజ్పేయిని అక్కడకు పంపించారు. అలాగే అరెస్టయిన పోలీసులకు బెయిల్ వచ్చేలా సహకరించేందుకు వీలుగా గాజువాక క్రైమ్ సీఐ కె.పైడపునాయుడిని పంపించారు. కాగా, ఏసీబీ కోర్టులో నగర పోలీసులు వేసిన బెయిల్ పిటీషన్ను న్యాయమూర్తి తిరస్కరించడంతో హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనిఐ పలుమార్లు వాదనలు జరిగినప్పటికీ ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన నగర పోలీసులకు బెయిల్ మాత్రం ఇంతవరకూ రాలేదు. తాజాగా.. వేసిన బెయిల్ ఫిటిషన్ హైకోర్టులో ఈనెల 13న విచారణకు రానున్నది. నగర పోలీస్ అధికారులు అరెస్టు ఉదంతం నుంచి రాజస్థాన్లోనే గడుపుతున్న బాధితపోలీసు అధికారుల కుటుంబసభ్యులతో పాటు నగర పోలీస్ అధికారులుకూడా 13న బెయిల్ మంజూరవుతుందనే ఆశాభావంతో ఉన్నారు.
 Tag: Visakhapatnam police arrested in Rajasthan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *