Vizag has a massive air traffic

 వైజాగ్ లో భారీగా పెరిగిన ఎయిర్ ట్రాఫిక్

Date:27/05/2018
విశాఖపట్టణం ముచ్చట్లు :
 విమాన సర్వీసులు పెరగడం, ఆయా సంస్థలు పోటాపోటీగా ఆఫర్ల వర్షం కురిపించడం ఈ రంగంలో జోరందుకుంది.ఆకాశవీధిలో విహరించాలనుకునేవారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది మరోవైపు ప్రయాణ ప్రయాస తగ్గి సుఖంగా, శరవేగంగా గమ్యస్థానాలకు చేరే అవకాశముండటంతో విమాన ప్రయాణాలకు ఆసక్తి చూపే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తక్కువ ధరకే ఆకాశంలోకి ఎగిరిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌లో శరవేగంగా దూసుకుపోతోంది మన ఎయిర్‌ పోర్టు కేంద్రం వైజాగ్‌ ఐఎన్‌ఎస్‌ డేగా. రాష్ట్రంలోనైతే ఇది నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది.విజయవాడ నుంచి సర్వీసుల్లో 6.22 లక్షలే ఎయిర్‌ ట్రాఫిక్‌ కాగా, తిరుపతి, రాజమండ్రి నుంచి ఏటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంఖ్య రీత్యా విజయవాడ మాదిరిగానే ఉంటోంది. వైజాగ్‌ నుంచి అత్యధిక గమ్యస్థానాలు (డెస్టినేషన్స్‌)కు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 13 దేశీయ గమ్యాలకు, నాలుగు విదేశీ గమ్యస్థానాలకు సర్వీసులు వైజాగ్‌ నుంచి నడుస్తున్నాయి. ఎయిర్‌ కార్గో (రవాణా) కూడా విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి ఏటా గణనీయంగానే పెరుగుతోంది. 2015-16లో ఎయిర్‌ కార్గో  2938 టన్నులు జరగ్గా, 2016-17 సంవత్సరంలో 4708 టన్నులకు పెరిగింది. ఏటా పెరుగుతున్న సర్వీసులతో, దేశ, విదేశీ గమ్యస్థానాలతో బిజీ కేంద్రంగా మారింది. సంవత్సరానికి 24,80,379 మంది పాసింజర్లతో కళకళలాడుతోంది. రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, రాజమండ్రి ఎయిర్‌ ట్రాఫిక్‌ల కంటే మించిపోయి శరవేగంగా ప్రగతిదిశలో ప్రయాణం చేస్తోంది. విశాఖ కేంద్రంగా స్టీల్‌ప్లాంట్‌, పోర్టు, డాక్‌యార్డు, షిప్‌యార్డు, డిసిఐ, హెచ్‌పిసిల్‌, భెల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటమూ విమానయానం పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులు నానాటికీ పెరుగుతున్నాయి. దుబారు, కౌలాలంపూర్‌, సింగపూర్‌, కొలంబోలకు విమానాలు తిరుగుతున్నాయి. బ్యాంకాక్‌, అబుదాబికి త్వరలోనే సర్వీసులు రానున్నాయి. విశాఖ కేంద్రంగా 33 విమానాలు రోజూ 66 సర్వీసులుగా వివిధ గమ్యస్థానాలకు నడుస్తున్నాయి. ఎయిర్‌ ఇండియా ఇండిగో, స్పైస్‌ జెట్‌ వీటిని ఆపరేట్‌ చేస్తున్నాయి. ట్రూజెట్‌, ఎయిర్‌ ఒడిశా, గోవా ఎయిర్‌, విస్తరా త్వరలో రానున్నాయి. ఎయిర్‌ ఏషియా తన విమాన సర్వీసులను పెద్ద ఎత్తున పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. కొల్‌కతా-ఢిల్లీ మధ్య పాసింజర్ల డిమాండ్‌కు తగ్గట్టుగా సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్‌ ఏషియా సిద్ధమైంది. విదేశీ విమానాలు దిగడానికి అనువుగా ప్లాట్‌ ఫారాలను, రన్‌ వేలను అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడున్న జాతీయ రహదారి పక్కకు 75 మీటర్లను పొడిగించడం ద్వారా విదేశీ విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడనుంది. దీనికోసం పాత ఎయిర్‌పోర్టు వైపు (తూర్పు దిశగా) 70 మీటర్లను అభివృద్ధి చేస్తున్నారు. వీటి కోసం రూ.150 కోట్లతో టెండర్లను ఇటీవలే పిలిచారు. భోగాపురం ఎయిర్‌ పోర్టు వచ్చేస్తుందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ టెక్నో ఎకనమిక్‌ ఫీజిబిలిటీ (టిఇఎఫ్‌) లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయకపోవడం, వైజాగ్‌కు 55 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భోగాపురంపై నీలినీడలు అలముకున్నాయి.
Tags:Vizag has a massive air traffic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *