వైజాగ్  కు తప్పని నీటి కష్టాలు

Date:17/03/2018
వైజాగ్ ముచ్చట్లు:
వేసవి ప్రారంభ దశలోనే విశాఖలో తాగునీటి సమస్య మొదలైంది. ఏప్రిల్‌, మే నెలల్లో ఇది మరింత జఠిలంగా మారనుంది. వేసవి ఎలా గట్టెక్కుతుందోనని ఇంజినీరింగ్‌ అధికారులే తలలు పట్టుకుంటున్నారు. ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో సరిపడా వర్షాలు కురవకపోవడంతో దాని ప్రభావం వేసవిపై పడింది. ఉష్ణ తాపానికి నీటి మట్టాలు పడిపోతున్నాయి. గోస్తనీ రివర్‌ బెడ్‌లోనూ నీటి మట్టాలు తగ్గి బోర్‌వెల్స్‌కు నీరు అందడం లేదు. నగరానికి ప్రధాన నీటి వనరు ఏలేశ్వరంలోనూ నీటి మట్టాలు పడిపోవడంతో కెనాల్‌ సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయడం లేదు. రైవాడ, ముడసర్లోవ, తాటిపూడి, గంభీరం, మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ల పరిస్థితి అందోళనకరంగా ఉంది. దీంతో నగరంలోని అపార్టుమెంట్లు, శివారు ప్రాంతాల్లో అప్పుడే దాహం కేకలు వినిపిస్తున్నాయి. నగరంలో రోజుకు దాదాపుగా 120 ఎంజిడిల నీరు అవసరంకాగా ప్రస్తుతం 67.31 ఎంజిడిలు ఇస్తున్నారు. బోర్లపై ఆధారపడే అపార్టుమెంటు వాసులు భూగర్భ నీటి మట్టాలు పడిపోవడంతో వాటర్‌ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నగరానికి నీటిని అందించే జలాశయాల్లో ఏలేరు కెనాల్‌దే ప్రధాన పాత్ర. దీనికి సంబంధించిన కెనాల్‌ ద్వారా రోజుకు 162 ఎంజిడిల ముడి నీటిని తరలించొచ్చు. ప్రస్తుతం ఏలేశ్వరంలో తగినంత నీరు లేక రోజుకు 135 ఎంజిడిలే విడుదల చేస్తున్నారు. అందులో ఎండకు ఆవిరి కావడం, మధ్యలో తూర్పు గోదావరి జిల్లా రైతులు వ్యవసాయ వాడకాలకు మోటార్లను వినియోగించడంతో 70 ఎంజిడిలే విశాఖకు చేరుకుంటోంది. ఇందులో కూడా స్టీల్‌ప్లాంట్‌, ఎన్‌టిపిసి, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఎపిఐఐసికి 40 ఎంజిడిలు పోగా 30 ఎంజిడిలే తాగు అవసరాలకు మిగులుతోందని అధికారులు చెబుతున్నారు. గోస్తనీ నదిలో పద్మనాభం మండలం బోని గ్రామం వద్ద బోర్‌ వెల్స్‌ ద్వారా నగరానికి రోజూ 4 ఎంజిడిల నీటిని తరలిస్తారు. ప్రస్తుతం వేసవి కావడంతో రివర్‌ బెడ్‌లో నీటి మట్టాలు పడిపోయాయి. తాటిపూడి జలాశయం నుంచి గోస్తనీలోకి నీటిని వదిలితే రివర్‌ బెడ్‌లో నీటి మట్టాలు పెరుగుతాయి. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకోసారి 50 క్యూసెక్కులు నీటిని వదలడం ఆనవాయితీ. గతంలో తాటిపూడిలో నీటి మట్టం బాగా ఉన్నప్పుడు వేసవిలో నీటిని వదిలినా అక్కడ అభ్యంతరాలు ఉండేవి కావు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి మట్టాలు తగ్గిపోతుండంతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రైతులు నీటి విడుదలపై అభ్యంతరం పెడుతున్నట్లు సమాచారం. దీంతో అక్కడి ఎమ్మెల్యే కూడా నీటిని విడుదల చేయొద్దని ఆ జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గోస్తనీ బోర్‌వెల్స్‌ పరిస్థితి అందోళనకరంగా మారింది. శివారు ప్రాంతాల్లో వేసవికి ముందే నీటికష్టాలు మొదలయ్యాయి. నీటి కొరత ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని కష్టాలు పడాలోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటిని జివిఎంసి విడుదల చేస్తోంది. పూర్తి స్థాయి వేసవి వస్తే నాలుగైదు రోజులుకోసారి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆరిలోవ ప్రాంత ప్రజలకు నీటి అవసరాలు తీర్చడమే కాకుండా నగరానికి పెద్ద అండగా ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్‌లో రోజురోజుకూ నీటిమట్టం పడిపోతోంది. ఇప్పటికే చాలా వరకు రిజర్వాయర్‌ ఎండిపోయింది. ఈ వేసవి నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. హనుమంతువాక నుంచి దీనదయాల్‌పురం వరకూ ఉన్న కొండవాలు ప్రాంత ప్రజలు వేసవి వచ్చిందంటే చాలు బెంబేలెత్తిపోతారు. అలాంటిది ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో ఇంకెంత బాధలు పడాలోనని భయపడుతున్నారు. కొండవాలు ప్రాంతాల్లోని చాలా కాలనీలు జివిఎంసి సరఫరా చేసే నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. నీటి ట్యాంకర్‌ ద్వారా సరఫరా చేసే నీరు అరకొరగానే ఉండడంతో తిరిగి వీధి బోర్లపైనే ఆధార పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. రోజు విడిచి రోజు ఇస్తున్న నీటిని కూడా అరగంటకు మించి సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. ఇంటి అవసరాలు కూడా తీరడం లేదంటున్నారు.సూర్యతేజ నగర్‌ నిర్వాసితుల పరిస్థితి మరీ అధ్వానంఒకటో వార్డు పరిధి సీవేజ్‌ప్లాంట్‌ వద్ద నివాసముంటున్న సూర్యతేజనగర్‌ నిర్వాసితుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వీరి కోసం ఏర్పాటు చేసిన బోరు కనెక్షన్‌ కట్‌ చేయడంతో జివిఎంసి వాటర్‌ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే భూగర్భ జలాల మట్టం పడిపోవడంతో కొన్ని బోర్లు ఎండిపోయాయి. మరి కొన్ని బోర్లు కొద్ది నిమిషాల పాటే నీటిని ఇస్తున్నాయి. మూడో వార్డు పరిధి వెటర్నరీ కాలనీలోని ఓ ఆపార్టుమెంటులో 300 అడుగుల లోతున తవ్వించినా అరగంట కంటే మించి నీరు రావడం లేదు. శివారు ప్రాంతాల్లో నీరు సరిపోక చాలా మంది ఇళ్లు మారిపోతున్నారు. గ్రామీణ తహశీల్దారు కార్యాలయం వద్దగల ఓ గ్రూపు హౌస్‌లో నీరు రాక దాదాపు 300 అడుగుల వరకు బోరు తవ్వించారు. సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఏడాదిగా బోరు ఎండిపోయి ఉంది. అప్పటి నుంచి జివిఎంసి ట్యాంకర్‌ నీటిపైనే అధారపడుతున్నారు. ఈ ఏడాది ఆశించినంత వర్షపాతం లేకపోవడం, జలాశయాలు రోజు రోజుకూ అడుగంటి పోవడంతో ఈ ఏడాది నీటి కష్టాలు తప్పవనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు. ఈ వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జివిఎంసి నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకొని రెండు రోజులకోసారైనా గంటపాటు నీళ్లు ఇచ్చేందుకు తీర్మానించాలని ప్రజలు కోరుతున్నారు. పెద్దపెద్ద హోటళ్లకు నీటి అమ్మకాలను తగ్గించి వేసవి పోయే వరకూ సామాన్యులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలంటున్నారు.  జివిఎంసి 70, 71 వార్డుల్లోకి గాంధీనగర్‌, పులగానిపాలెం, ఏకలవ్య కాలనీ ప్రాంతాల్లో నీటి సమస్య ఎదురయ్యే అవకాశముంది. లక్ష జనాభా ఉన్న ఈ వార్డులకు రోజు విడిచి రోజు తాగునీటిని అందిస్తున్నారు. రానున్న కాలంలో పరిస్థితి మరింత జఠిలం కానుంది.
Tags: Vizag’s wrong water problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *