వానొచ్చెనంటే వరదొస్తద 

Date:19/06/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఏటా వర్షాకాలం గోదావరి నది ఉప్పోంగి ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద పలు కాలనీలు ముంపునకు గురవుతాయి. ప్రవాహం ఒక్కోసారి ప్రమాద స్థాయికి చేరుకుంటుంది.వర్షాకాలం వచ్చిందంటే భద్రాచలం గోదావరి తీరప్రాంత ప్రజలు దినదిన గండంగా బతకాల్సిందే. ఎప్పుడు వరద ఎటు నుంచి ఉప్పెనలా ఊరి మీద పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల నిర్వహించిన సమీక్షల తర్వాత కొన్ని విషయాలు తేటతెల్లమయ్యాయి. నిల్వ కేంద్రాలను గుర్తించినప్పటికీ వాటికి సరకులు చేరలేదు. ఏటా వచ్చే వరదలే కదా అని ఏమరపాటు ప్రదర్శిస్తే ఇబ్బంది పడక తప్పదని గతంలో పలు సంఘటనలు రుజువు చేశాయి. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని అక్టోబరు వరకు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు.ఇటువంటి సందర్భాల్లో అధికారుల అప్రమత్తతే ప్రజలకు రక్షణగా నిలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు మండలాలకు ముంపు ప్రభావం ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాలకు రాకపోలు సైతం నిలిచిపోతాయి. అన్ని శాఖల అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముంపు, పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన, నష్ట నివారణ, ఆహార పదార్థాల పంపిణీ వంటివాటిపై అధికారులు ఇప్పటికే సమన్వయంతో ముందుకు కదలాల్సి ఉంది.ప్రమాద స్థాయిలో వరదొస్తే ముంపు బాధితులను తరలించేందుకు పునరావాస కేంద్రాలను ముందే గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే ఈ గుర్తింపు జరిగింది. వీటిలో ఎక్కువగా విద్యాలయాలు ఉన్నాయి.. ఇక్కడ మంచినీళ్లు, భోజన సదుపాయం కల్పించాలి. వైద్య శిబిరాలను నిర్వహించాలి. ఫ్యాన్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి. ముంపు ప్రాంతాలకు నిత్యావసర సరకుల కొరత రాకుండా ఉండేందుకు బియ్యం, కిరోసిన్‌ వంటివి నిల్వ చేస్తారు. జిల్లాలోని 5 మండలాల్లో 10 చోట్ల వీటిని సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ మెరక ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. గోదావరి వరదల కాలంలో గుండాల వంటి చోట్లకు వెళ్లాలంటే తిప్పలు తప్పవు. వాగులు పొంగి పొర్లుతుంటాయి. అక్కడ 3 నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్వారావుపేటలో 1, దమ్మపేటలో 1, చర్లలో 4, దుమ్ముగూడెంలో 1 చొప్పున నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3.35 లక్షల కిలోల బియ్యాన్ని కార్డుదారుల కోసం అందించాల్సి ఉంది.మూడో హెచ్చరిక స్థాయిలో ప్రమాదం తలెత్తితే సర్వత్రా ఆందోళన తప్పదు. వర్షాకాలం వచ్చిందంటే భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లో అలజడి వాతావరణం నెలకొంటుంది. వరదల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేందుకు యంత్రాంగం తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లను ఛార్జింగ్‌లో ఉంచుకోవాలి. అవసరమైతే పవర్‌ ప్యాక్‌లను అందుబాటులో ఉంచాలి. ఇన్వర్టర్లను సిద్ధం చేయాలి. వైర్‌లెస్‌ సెట్‌లను ఉంచాలి. గజ ఈతగాళ్లను లాంచీలను పడవలను సిద్ధం చేయాలి. రెస్క్యూ బృందాలను ఆ సమయంలో రంగంలోకి దించాలి. భద్రాచలం కేంద్రంగా రెండు హెలీకాప్టర్లను అందుబాటులో ఉంచాలన్న ప్రతిపాదన ఉంది.
Tags:Wandering

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *