వరంగల్ ఇన్స్పెక్టర్లు..? జల్సాల కోసం విదేశాలకు
వరంగల్ ముచ్చట్లు:
బ్యాంకాక్‌లో విహార యాత్రలు.. థాయ్ మసాజ్‌లు.. శ్రీలంకలో అమ్మాయిలతో జల్సాలు..క్యాసినో జూదాలు.. ఇవన్నీ పారిశ్రామికవేత్తలో లేక సంపన్నులో విదేశాల్లో చేసుకున్న జల్సాలని అనుకుంటాం. కానీ.
ఈ స్థాయిలో ఎంజాయ్ చేసింది పోలీస్ శాఖలోని కొందరు ఇన్స్పెక్టర్లు. సొంత డబ్బులతో సెలవు పెట్టి విదేశాలకు వెళ్లితే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారే కాదు. కానీ.. ఫారిన్ టూర్‌తో ఇన్స్పెక్టర్లు.. ఓ లిక్కర్
డాన్‌తో ఉన్న సంబంధాలే కలకలం రేపుతున్నాయి.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆ ఇన్స్పెక్టర్ల గురించి డిపార్ట్మెంట్లో ప్రస్తుతం కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఇదే కమిషనరేట్ పరిధిలోని
ఓ లిక్కర్ డాన్ కుమారుడు.. ఇన్స్పెక్టర్ల ఫారిన్ ఎంజాయ్‌మెంట్‌కు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేశారట. మన దేశంలోని కొన్ని హాలిడేస్పాట్లతోపాటు గోవాలోనూ ఓ రేంజ్లో ఎంజాయ్ చేసినట్టు సమాచారం.
మొదట్లో ఈ విషయం గుట్టుగా ఉన్నా.. తర్వాత గుప్పుమంది. ఆ నోటా.. ఈ నోటా ఉన్నతాధికారులకు చేరడంతో కన్నెర్ర చేశారట. విచారణకు ఆదేశించడంతో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు
రంగంలోకి దిగాయి.వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం ఐదుగురు ఇన్స్పెక్టర్లు లిక్కర్‌డాన్ కుమారుడితో మిలాఖతై విదేశాల్లో చక్కర్లు కొట్టినట్టు నిఘా వర్గాలు తేల్చాయట. వెంటనే ఆ ఇన్స్పెక్టర్లకు
ఛార్జ్‌మెమోలు జారీ చేశారట. సీఎం కేసీఆర్ జనగామ పర్యటన బందోబస్తులో ఉన్న ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఆ మెమోలు తీసుకోలేదట. మిగతా ఇద్దరికి తాఖీదులు అందినట్టు సమాచారం. 3 నెలల క్రితం
లిక్కర్ డాన్ కుమారుడు.. ఆ ఐదుగురు ఇన్స్పెక్టర్లతో విదేశీయానం చేయించినట్టు విచారణలో తేలిందట. అప్పుడే వారిని బదిలీ చేసేశారు. ఒకరిని పరకాల సబ్ డివిజన్ పరిధిలోకి.. మరో ఇద్దరు ఖమ్మం,
మహబూబాబాద్.. ఇంకొకరు వరంగల్ ఈస్ట్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారట. ఇంకొకరు వీఆర్‌లో ఉన్నట్టు టాక్.కేవలం ఫారిన్ టూర్లోనే కాదు.. గుడెప్పాడ్ సమీపంలోని ఒక హోటల్లో ఆ ఐదుగురు ఇన్స్పెక్టర్లకు
లిక్కర్ డాన్ కుమారుడు భారీ పార్టీ ఇచ్చాడట. సదరు అధికారులు వరంగల్‌లో పనిచేసినప్పుడు లిక్కర్ డాన్‌కు చెందిన బార్లు.. వైన్ షాపులు వాళ్ల పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఉండేవట. అలాగే ఒక యువతిని
మోసం చేసిన ఘటనలో లిక్కర్ డాన్ కుమారుడిపై మట్టేవాడలో కేసు నమోదైంది. ఆ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న ఆ లిక్కర్ డాన్ కుమారుడు.. ఐదు నెలలుగా పరార్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.
కానీ.. అదే లిక్కర్ డాన్ కుమారుడు మూడు నెలల క్రితం ఇన్స్పెక్టర్లను విదేశీయాత్రలు చేయించడం విశేషం. ఇన్స్పెక్టర్ల తీరును పోలీస్ బాస్‌లు తీవ్రంగానే పరిగణిస్తున్నారట. త్వరలో వేటు వేస్తారని ప్రచారం
జరుగుతోంది. అయితే తీగ లాగేకొద్దీ ఈ ఎపిసోడ్లో కొందరు డీఎస్పీ, ఏసీపీస్థాయి అధికారుల పాత్ర కూడా బయటపడుతోందట. వారిపై అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్టు సమాచారం. మరి.. ఓరుగల్లు
ఖాకీల యవ్వారంలో ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
Tags: Warangal Inspectors ..? Abroad for jalsas