వరంగల్ మరో మల్లన్న సాగర్…

Date:14/02/2018
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్‌ జిల్లాలో మరో మల్లన్నసాగర్‌ తరహా భూ సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. టెక్స్‌టైల్‌ పార్కు కోసం బలవంతంగా భూములు గుంజుకునేందుకు రెడీ అయింది. పేదలకు ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్ని కూడా అప్పనంగా లాక్కునే ప్రయత్నం జరుగుతున్నది. వరంగల్‌ జిల్లాలో భారీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న ధర్మసాగర్‌ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల భూముల్ని ఎంచుకున్నారు. 3,534 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వ భూమి కాకుండా మరో 1,325 ఎకరాల ప్రైయివేట్‌ భూమి సేకరించాలని సర్వేలు చేశారు. ముప్పారం గ్రామంలో 870 ఎకరాల కొనుగోలుకు సర్వేలు పూర్తి చేయగా, దేవునూర్‌లో 455 ఎకరాల కొనుగోలుకు సర్వే తుది దశలో ఉన్నది. ఈ భూముల్ని మూడు రకాలుగా విభజించి ధర నిర్ణహించారు. కుష్కి భూమికి రూ. 4.50 లక్షలు, కుష్కి, తరి ఎకరా రూ. 6లక్షలు, తరి ఎకరాకు 7లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. అసైన్డ్‌ భూములకు మాత్రం ధర నిర్ణయించకుండా పేదల నుంచి అప్పనంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముప్పారం గ్రామంలో ఇప్పటి వరకు 104 ఎకరాల 20 కుంటల భూమికి అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించారు. రెండో దఫాలో మరో 187 ఎకరాల 4 గుంటల భూమికి సంబంధించి రైతులతో అంగీకారం కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు. దేవునూరు గ్రామంలో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.టెక్స్‌టైల్‌ నిర్మాణం చేసే దేవునూరు, ముప్పారం గ్రామాల్లోని సర్వే నెంబర్లు 536, 531, 414, 451, 629, 461, 618తో పాటు మరో 40 సర్వే నెంబర్లలో గుట్టల్ని ఆనుకొని 3వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇందులో ముప్పారం, దేవునూరుకు చెందిన దళిత, ఆరె, ముస్లిం, పద్మశాలి, తెనిగ, కుర్మ తదితర కులాల వారికి ఎకరం, రెండెకరాల చొప్పున గతంలో ప్రభుత్వం సుమారు 300 మందికిపైగా 1400 ఎకరాలు పంపిణీ చేసింది. వీరికి హక్కు పత్రాలు కూడా ఇచ్చారు. చెట్టు చేమ తొలగించి వారు సాగు చేసుకుంటున్నారు. ఆ భూములను ఇప్పుడు ప్రభుత్వం గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నది. దేవునూరు గ్రామానికి చెందిన మిర్యాల మల్లయ్యకు 4 ఎకరాల భూమి ఉన్నది. అందులో 3 ఎకరాల పట్టా భూమి కాగా ఎకరం ప్రభుత్వం ఇచ్చిన భూమి. ఈ రైతు భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. కానీ, ఇవ్వాల్సిందే అంటూ అధికారులు హుకుం జారీ చేయడంపై మండిపడుతున్నారు.
Tags: Warangal is another Malappanna Sagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *