వ్యర్థాలతో నిండిపోయిన మేడారం

Date:21/02/2018
వరంగల్ ముచ్చట్లు:
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసి.. 15 రోజులు దాటింది.. అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ పరిసర అటవీ గ్రామాల ప్రజలు మాత్రం విషవాయువులను పీల్చుకొని అనారోగ్యానికి గురవుతున్నారు. జాతరలో సందర్శకులు వాడి పడేసిన చెత్తాచెదారం, జంతు కళేబరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. జాతర ఏర్పాట్లు చేసిన రైతుల భూములు వ్యర్థాలతో నిండిపోయాయి.. ఎవరి భూమి ఎంతవరకో కూడా తెలియకుండా హద్దులూ చెరిపేశారు. వ్యర్థాలతో కంపుకొడుతున్న తమ భూముల వద్దకు పోయిన రైతులు హద్దులు వెతుక్కోవడం గగనంగా మారింది.కాలుష్యం కోరల్లో చిక్కుకున్న మేడారం, పరిసర అటవీ గ్రామాల ప్రజలు పారిశుధ్య లోపం వల్ల వ్యాధుల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. జాతర సందర్భంలో నిర్మించిన మరుగుదొడ్లను పూడ్చేయకపోవడంతో ఈగలు, దోమలు పెరిగాయి. జాతరలో మెడికల్‌ క్యాంపులు నిర్వహించిన అధికారులు, జాతర అనంతరం ఆ పరిసర గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించలేదు. ‘సువాన్‌’ పిచికారీ లేదు.. ఫాగింగ్‌ మాటే లేదు. మేడారం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, చింతల్‌, రెడ్డిగూడెం, పగిడాపూర్‌ గ్రామాల్లో ప్రజలు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. మూగజీవాల పరిస్థితీ అలాగే ఉంది.జ్వరాలు, దగ్గుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్యం నేపథ్యంలో పశువులను నెల రోజులుగా బయటకి పంపించడం లేదు. అయినప్పటికీ విషవాయువుల వల్ల పలు పశువులు మృత్యువాతపడ్డాయి. జాతర అనంతరం గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి పరిస్థితిని అధ్యయనం చేసి వెళ్లిపోయిన వైద్య బృందాలు మళ్లీ కానరాలేదు. పగలంతా ఈగల మోతతో, రాత్రి వేళలో దోమల బాధతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేయకపోవడమే దీనికి ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు.మేడారం జాతరలో ముందు నుంచి వివిధ ప్రభుత్వ శాఖాధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. జాతర అనంతరమూ అదే పరిస్థితి. పంచాయతీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖల నడుమ సమన్వయ లోపం బహిర్గతమైంది. ఈగలు, దోమల నివారణకు మందులు వైద్య, ఆరోగ్య శాఖకు ఇచ్చామని, వాటిని పిచికారీ చేయాల్సింది ఆ శాఖ సిబ్బందేనని పంచాయతీ శాఖ చెబుతోంది. జాతరలో దోమల నివారణకు ఫాగింగ్‌ చేసిన అధికారులు, జాతర అనంతరం మరిచారు. ఫాగింగ్‌కు సంబంధించి మందులు ఇవ్వడమే తమ బాధ్యత అని, గ్రామాల్లో పిచికారీ చేయాల్సిన పని మాత్రం వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించాల్సి వుంటుందని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు.
Tags: Waste material

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *