Water, funds and appointments are not TRS slogan

నీళ్లు, నిధుల, నియామకాలు టీఆర్ ఎస్ నినాదం కాదు

Date:24/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో టీఆర్ఎస్ భావోద్వేగాలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రజల నినాదాన్ని వాడుకుంటూ.. అమర వీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా నాలుగేళ్ల పాలన సాగిందన్నారు. కేసుల పేరుతో తనపైనా కుట్రలు చేసి రాక్షసానందం పొందారని.. చివరికి తన కూతురి నిశ్చితార్థానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన రేవంత్.. టీఆర్ఎస్, కేసీఆర్‌ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం కేసీఆర్‌ది కాదు. తెలంగాణ ప్రజలు సామాజిక న్యాయం కోరుకున్నారు.. ఎన్ని బలహీనతలు ఉన్నా.. మనోడే కదా అని ప్రజలు ఉద్యమంలో కేసీఆర్‌ని నమ్మారు. కేసీఆర్ డిక్షనరీలో సామాజిక న్యాయం అనే పదం లేదు. మహిళలకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వకపోవడం దారుణం. కేసీఆర్ మావోయిస్టు అజెండానే.. మా అజెండా అని చెప్పి.. కుటుంబ పాలనను తెచ్చారు. 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు.. బంగారు తెలంగాణ పేరు చెప్పారు. ఏ హమీని అమలు చేయలేదు. నాలుగున్నరేళ్లు ప్రజలను తమవైపుకు తిప్పుకొనే ప్రయత్నం మాత్రమే చేశారు’. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని అమ్మ నా.. బొమ్మానా అంటూ కేటీఆర్ అహంభావంతో మాట్లాడలేదా.. రాహుల్ ని బఫూన్ అని. జీవన్ రెడ్డి లాంటి వాళ్లను గుంటనక్కలు అని టీఆర్ఎస్ నేతలు పరుషమైన వ్యాఖ్యలు చేయలేదా. అందుకే మేం అదే స్థాయిలో స్పందిస్తున్నాం.. మీరు చేస్తే మంచిది.. మేం మాట్లాడితే తప్పా.
కేటీఆర్ కుమారుడిపై ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయలేదు. సీఎంగా ఉన్న కేసీఆర్ సచివాలయానికి రాకున్నా.. కేటీఆర్ కొడుకు మాత్రం సచివాలయానికి వెళ్లారు. భద్రాచలం రాముడికి బడి పిల్లగాడితో పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపడంలో ఆంతర్యం ఏంటి. అంటే కేటీఆర్ కుమారుడ్ని రాష్ట్రానికి రోల్ మోడల్‌లా చూపిస్తున్నారా ’అని ప్రశ్నించారు. ‘మీ మనువడిని రోల్ మోడల్‌గా చూపిస్తున్నప్పుడు.. మేం ఎందుకు మాట్లాడ కూడదు. కుమారుడి గురించి మాట్లాడుతున్నారు అని కేటీఆర్ బాధపడుతున్నారు.. మరి నా కూతురు నిశ్చితార్థానికి వెళ్లకుండా మీరు కుట్రలు చేయలేదా. కోర్టులో బెయిల్ రాకుండా ఢిల్లీ నుండి లాయర్లను తీసుకొచ్చి వాదనలను వినిపించారు. ఇంత రాక్షసంగా మనిషి అనేవాడెవ్వడు చేయడు! మీరు చేస్తే మంచిది.. మేం మాట్లాడితే తప్పా’ అని ప్రశ్నించారు. న దూకుడుపై అందరిలోనూ తప్పుడు అభిప్రాయం కలిగేలా టీఆర్ఎస్ రహస్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఏ పదవిని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభుత్వం నడిపారని గుర్తుచేశారు.అలాగే మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ రాజకీయ అనుభవం లేకుండానే ప్రధాని బాధ్యతలు చేపట్టారని తెలిపారు. రాజీవ్ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేశారనీ, పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడిగా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా తాను పనిచేశానని చెప్పారు. ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
Tags:Water, funds and appointments are not TRS slogan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *