నిబంధనలకు నీళ్లు..ఇష్టారాజ్యంగా వెంచర్లు..

Date:18/06/2018
ఆదిలాబాద్‌ ముచ్చట్లు:
నిబంధనలకు విరుద్ధంగా ఆదిలాబాద్ పట్టణం సమీపంలో వెంచర్లు వేస్తున్నట్లు ఇటీవలిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా గురించి తెలిసినా.. సంబంధిత అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉంటోందని బాధ్యులపై చర్యలు తీసుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తూ స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్ల వ్యాపారం సాగించేస్తున్నారని, రూ.కోట్లు దండుకుంటున్నారని విమర్శిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీప గ్రామాలతోపాటు పట్టణీకరణ చెందుతున్న మండల కేంద్రాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. పంటపొలాలను ప్లాట్లుగా మారుస్తున్నవారూ ఉన్నారు. అయితే వ్యవసాయభూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేయాలంటే తొలుత భూమిని మార్పిడి చేయించుకోవాలి. దీనికి కొన్ని నిబంధనలు అనుసరించాలి. ముందుగా వ్యవసాయ భూమిని స్ధిరాస్థి వ్యాపారానికి మార్చుకుంటున్నట్లు సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమికి రిజిస్ట్రేషన్‌ విలువలో మూడుశాతం రుసుముగా చెల్లించాలి. దీనికి సంబంధించి తహసీల్దారు ద్వారా నివేదిక తెచ్చుకున్నాక ఆర్డీఓ భూ మార్పిడి చేస్తారు. ఈ భూమార్పిడి చేసుకున్నాకే ప్లాట్లు విక్రయించేందు కోసం డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌, కంట్రి ప్లానింగ్ ఆమోదం పొందాలి. దీనికోసం తొలుత సంబంధిత గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలి. ఎకరం లోపల ఉంటే జిల్లాలో ఉండే కంట్రి, టౌన్‌ప్లానింగ్‌ అధికారులే అనుమతి జారీచేస్తారు. అంతకుమించి ఉంటే మాత్రం హైదరాబాద్‌ కార్యాలయం నుంచి అనుమతి రావల్సిందే.
ఆదిలాబాద్ లో కొత్తగా వెలుస్తున్న పలు వెంచర్లు ప్రభుత్వ నిబంధనలేవీ పట్టించుకోకుండా వేసినవే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారం చేసే మొత్తం స్థలంలో పదిశాతం ప్రజాఅవసరాలకు వదిలిపెట్టాలన్న నిబంధన ఉంది. అయితే ఈ రూల్ ను ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఎక్కువ ప్లాట్లు కావాలనే ఉద్దేశంతో రహదారులకోసం చాలామంది 15, 20 అడుగులు మాత్రమే విడిచి పెడుతున్నారు. గృహ నిర్మాణాలు పూర్తయ్యాక రోడ్లు ఇరుకుగా మారడం ఖాయం. విషయం తెలిసినా స్థిరాస్థి వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు అంటున్నారు. ప్రజాఅవసరాల కొందరు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా స్థనం వదిలిపెడుతున్నారు. కొందరైతే మౌలిక వసతుల ఊసే లేకుండా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివన్నీ వెంచర్లలో ఉండాలంటే భారీగా ఖర్చు చేయాలి. దీంతో సంబంధిత అధికారులకు కాస్ట్లీ బహుమతులు ఇచ్చి వారిని ప్రసన్నం చేసుకుంటున్నారని.. అధికారయంత్రాంగం నుంచి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే ఇలాంటి వెంచర్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాక మౌలిక వసతుల భారం ప్రభుత్వంపైనే పడుతోంది. అనుమతి రూపేణ వచ్చే బెటర్‌మెంట్‌ ఛార్జీలు నష్టపోవడంతోపాటు ఇటు సౌకర్యాల పేరిట ప్రభుత్వమే రూ.కోట్ల భారం పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి నిబంధనలకు అనుగణంగా వెంచర్లు సాగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags:Water to the rules ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *