Where is the big? (Medak)

పెద్దదిక్కు ఎక్కడ..? (మెదక్)

Date:16/07/2018
మెదక్ ముచ్చట్లు:
పాఠశాలల నిర్వహణలో ప్రధానోపాధ్యాయులది కీలకపాత్ర. పర్యవేక్షణ, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయించడం, మధ్యాహ్న భోజన పథకాన్నిమార్గదర్శకాలకు అనుగుణంగా అమలయ్యేలా చూడటం తదితర బాధ్యతలు ఉంటాయి. ఇప్పటికే శాశ్వత జిల్లా డీఈఓ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడటం, పలువురు ప్రధానోపాధ్యాయులకు ఇంఛార్జి మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో బడులకు పెద్దసార్లు లేకపోగా… ప్రస్తుతం ఒకేసారి పెద్దసంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల పరిస్థితి. సర్కారు ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి విడతలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 247 మంది దరఖాస్తు చేసుకోగా 138 మందికి స్థానచలనం లభించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించగా బదిలీ అయిన వారు విధుల్లో చేరారు. ఈనేపథ్యంలో మెదక్‌ జిల్లాలో ఖాళీలు ఏర్పడ్డాయి.జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలో ఒక్కచోట కూడా హెచ్‌ఎంలు లేకపోవడం గమనార్హం. చిన్నశంకరంపేట, మడూరు, సూరారం, ధరిపల్లి, చందంపేట, మిర్జాపల్లి, శేరిపల్లిలో ఉన్నత పాఠశాలలు ఉండగా మొన్నటి వరకు చిన్నశంకరంపేట మినహా మిగిలిన ఆరు చోట్ల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఆరుగురు ఇతర ప్రాంతాలకు బదిలీ అయి వెళ్లిపోయారు. పాపన్నపేట మండలంలోని పొడ్చన్‌పల్లి, కుర్తివాడ, కొడపాక, యూసుఫ్‌పేట, చీకోడ్‌ లింగాయిపల్లి పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఉమ్మడి రామాయంపేట మండలంలో అత్యధికంగా 12 చోట్ల పెద్దసార్లు లేరు. ఉమ్మడి కౌడిపల్లి మండలంలో ఎనిమిది పాఠశాలల్లో ఖాళీ అయ్యాయి. మెదక్‌ పట్టణం, హవేలి ఘనపూర్‌, కొల్చారం, వెల్దుర్తి, అల్లాదుర్గం మండలాల్లోని పలు పాఠశాలల్లో బదిలీ కాగా వారి స్థానాల్లో ఎవరూ రాలేదు.
జిల్లాలో 20 మండలాలు ఉండగా ఒక్కచోట కూడా ఎంఈఓ లేరు. వివిధ కారణాలతో రెండు, మూడు, నాలుగు మండలాలకు ఒక్కరే ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉండగా వారే 20 మండలాల బాధ్యతలు చూస్తున్నారు. తూప్రాన్‌ మండల విద్యాధికారి నర్సింలు… మనోహరాబాద్‌, రామాయంపేట, నిజాంపేటకు ఇంఛార్జిగా ఉన్నారు. కొల్చారం ఎంఈఓ నీలకంఠం.. మెదక్‌, హవేలి ఘనపూర్‌ మండలాలకు ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో తాము పనిచేసే ఉన్నత పాఠశాలలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి ఉంది. ఆయా చోట్ల సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌లను ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులుగా నియమించారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ జిల్లా నోడల్‌ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్‌ సెక్టోరియల్‌ అధికారులుగా వివిధ పాఠశాలల గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ఈనేపథ్యంలో ఆయా పాఠశాలల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
పెద్దదిక్కు ఎక్కడ..? (మెదక్) http://www.telugumuchatlu.com/where-is-the-big-medak/
Tags:Where is the big? (Medak)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *