వడ్డీ మినహాయింపు ఎక్కడ?

Date:14/02/2018
కుమురం భీం ముచ్చట్లు:
సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులకు వడ్డీ రాయితీ కోసం నిరీక్షణ తప్పడంలేదు. నాలుగేళ్లుగా వడ్డీ రాయితీ పొందేందుకు ఎదురు చూస్తున్నారు. రోజులు గడిచిపోతున్నా రాయితీ అందకపోతుండడంపై కర్షకుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణాలు పొందే రైతులు గడువులోగా అప్పు చెల్లిస్తే.. ప్రోత్సాహకంగా ఆరు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వడ్డీ రాయితీ మాత్రం విడుదల చేయలేదు. తర్వాత రెండేళ్లు ఈ తరహా ఉత్తర్వులు సైతం జారీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో పలువురు రైతులు దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. ఈ లోన్స్ తో ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, బోర్లు విద్యుత్తు మోటార్లు, ఆయిల్‌ ఇంజిన్లు తదితర వాటిని కొనుగోలు చేసుకున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు ఏటా రూ.20 కోట్ల మేర రుణాలు ఇస్తున్నాయి. ఆయా రైతులు వాయిదాల వారీగా రుణ మొత్తాన్ని చెల్లించాలి. వాయిదాలను నిర్ణీత గడువులోగా చెల్లించిన రైతులకు ప్రోత్సహకరంగా గత ప్రభుత్వాలు రైతులు తీసుకున్న ధీర్ఘకాలిక రుణ కిస్తులపై ఆరు శాతం వడ్డీ రాయితీ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావించింది.వాస్తవానికి రైతులు తీసుకునే రుణాలు వాయిదాలను బట్టి 11 నుంచి 13 శాతం వడ్డీ ఉంటుంది. గడువులోగా చెల్లించే రైతులు గతంలో ఆరుశాతం మినహాయించుకొని ఏడు శాతం వడ్డీతో కిస్తులను చెల్లిస్తే సరిపోయేది. దీంతో ఆర్ధికంగా వారికి కొంత ప్రయోజనకంగా ఉండేది. కానీ ఏటా వడ్డీ రాయితీపై వచ్చే ప్రభుత్వ ఉత్తర్వులు ఈ ఏడాది ఇప్పటి వరకు రాలేదు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకున్న ఆయా సహకార సంఘాల పాలక వర్గాలు సైతం దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కల్పించాలని కోరుతూ తీర్మానాలు చేసి సంబంధిత జిల్లా అధికారులకు పంపించారు. జిల్లా అధికారులు కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి లేఖ రాశారు. జనవరిలోగా అనేక మంది రైతులు కిస్తు చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ ఆదేశాల కోసం ఎదురు చూసిన రైతులు గడువు దాటిపోవడంతో చేసేదేంలేక వడ్డీతో సహా చెల్లించారు. కొంత మంది బకాయిదారుల జాబితాలో చేరిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీర్ఘకాలిక రుణంపై ఆరు శాతం వడ్డీ రాయితీని కొనసాగించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags: Where is the interest exemption?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *