నకిలీలపై కొరడా

Date:13/03/2018
మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:
మహబూబ్‌నగర్‌ జిల్లాలో పత్తి విత్తనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇదే అదనుగా కొందరు నకిలీ విత్తనాలు, నాణ్యతలేని విత్తనాలకు రైతులకు అంటగట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గుర్తించిన వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పత్తివిత్తనాల నాణ్యతను పరిశీలిస్తూ నిబంధనలకు తగ్గట్లుగా లేనివాటిని సీజ్ చేస్తున్నారు. భూత్పూర్‌ కేంద్రంగా సాగుతున్న విత్తన వ్యాపారంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాసిరకం, అనుమతిలేని విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. 35ఏళ్లుగా భూత్పూర్‌ సమీప గ్రామాల్లో రూ.కోట్లలో పత్తి విత్తనాల వ్యాపారం సాగుతోంది. నాసిరకం విత్తనాలతో దిగుబడులు రాక రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ విషయమై దృష్టిసారించిన సర్కార్ నకీలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో గతేడాది భూత్పూర్‌లోనే కొన్ని కంపెనీల్లో జరిగిన తనిఖీల్లో పెద్ద ఎత్తున అనుమతిలేని విత్తనాలు, అమ్మకాలు సాగించినట్లు తేలింది. గత అనుభవాలను దృష్ట్యా వ్యవసాయ శాఖ అధికారులు విత్తన ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం నుంచే నాణ్యతపై దృష్టి సారించి వివిధ దశల్లో స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి బృందాలతో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. భూత్పూర్‌లోని పత్తి విత్తన కంపెనీలకు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ అదనపు సంచాలకులు నారీమణిని ప్రత్యేక అధికారిణిగా నియమించారు. ఆమె ఇప్పటికే పలు దఫాలుగా పర్యటించి విత్తన ఉత్పత్తి కేంద్రాలను సందర్శించారు. వారి వద్ద ఉన్న ఫైల్స్, రైతుల వివరాలు, కంపెనీల ఒప్పందాలను తనిఖీ చేశారు. అదే తీరులో విత్తన నాణ్యతపై రంగారెడ్డి జిల్లా సహాయ సంచాలకులు రుద్రమూర్తి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేసింది. రెండు రోజులపాటు ఆయా కంపెనీల్లో (స్టిప్‌ టెస్ట్‌) పరీక్షలు నిర్వహించగా అనుమతిలేని జన్యు విత్తనాలను గుర్తించారు. దీంతో సుమారు రూ.4.5 కోట్ల విత్తన అమ్మకాలను నిలిపి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. నకిలీ విత్తనాల బాగోతంపై స్పందించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగణంగా ఉన్న నాణ్యమైన విత్తనాలనే రైతులకు విక్రయించాలని స్పష్టంచేశారు.
Tags: Whip on counterfeits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *