ఆయన లోటును ఎవరు భర్తీ చేస్తారు..? 

Date:13/02/2018
నగరి ముచ్చట్లు:
నగరి నియోజకవర్గానికి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదనంతర నాయకుడు ఎవరు? ఆయన ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కనుంది? సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకూ జరుగుతున్న చర్చలివి. ముద్దుకృష్ణమ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారనే విషయమై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముద్దుకృష్ణమ కుటుంబ సభ్యులకు దక్కబోయే స్థానాలపై రకరకాల అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నగరి నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చే నాయకుడు ముద్దుకృష్ణమ నాయుడు. ఆయన తరువాత ఆ నియోజకవర్గానికి రాజకీయ వారసుడు ఎవరనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తండ్రి స్థానాన్ని భర్తీ చేయడం కోసం ముద్దుకృష్ణమ ఇద్దరు కుమారులూ సిద్ధంగానే ఉన్నారు. కొంతకాలంగా వీరు నియోజకవర్గ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు కూడా. అయితే తెలుగుదేశం అధినేత ఈ ఇద్దరిలో ఎవరికి నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తారనే విషయం ఎవరి ఊహకూ అందడం లేదు. అసలు వీరికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారా.. లేక కొత్త నాయకులను తెరపైకి తెస్తారా అనే విషయమై కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.సాధారణ ఎన్నికలకు ఏడాది కాలం మాత్రమే ఉన్న నేపథ్యంలో నగరి నియోజకవర్గ బాధ్యతలు ఎవరికో ఒకరికి తప్పక అప్పగిస్తారనే భావిస్తున్నారు. అయితే అది ముద్దుకృష్ణమ కుమారులకా, లేక రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు కండీషన్‌ లేకుండా అప్పటి వరకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు పర్యవేక్షించేలా ఎవరినైనా సీనియర్‌ నాయకులకు లేదా జిల్లా పార్టీకి బాధ్యతలు అప్పగిస్తారా అనేది అంతుపట్టడం లేదు.2015 జూన్‌ నెలలో స్థానిక సంస్థల కోటా కింద ముద్దుకృష్ణమ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇంకా మూడున్నర సంవత్సరాల పదవీ కాలం వున్న ఈ పదవికి ముద్దుకృష్ణమ మరణం నేపథ్యంలో ఎన్నికలు అనివార్యం. ముద్దుకృష్ణమ స్థానంలో ఎవరిని ఎమ్మెల్సీ టిక్కెట్టు వరిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.ముద్దుకృష్ణమ కుటుంబ సభ్యులకే ఇస్తారా, లేక ఇతర సీనియర్‌ నాయకుల్లో ఎవరినైనా బరిలోకి దించుతారా అనే విషయమై ఇప్పుడు అధికార పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ స్థానం స్థానిక సంస్థల కోటాకు సంబంధించినది కాబట్టి జిల్లావ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధుల ఓటింగు ద్వారా ఎన్నిక జరుగుతుంది.2005లో జరిగిన ఎన్నికలో ముద్దుకృష్ణమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముద్దుకృష్ణమపై జిల్లా పరిధిలోని అన్ని పార్టీల నాయకులకు ఉన్న అభిమానమే దీనికి ప్రధాన కారణం. ఈ ఎన్నికకు ముందు జరిగిన శాసన సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ముద్దుకృష్ణమ ఓడిపోయారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఈయన పట్ల సానుభూతి వ్యక్తమైంది. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వడంతో ఈయనపై అభిమానంతో వైసీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది.వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, నారాయణస్వామి సహా అత్యధికులకు ముద్దుకృష్ణమతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వీరు జగన్‌కు నచ్చజెప్పి పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. నిజానికి స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. గెలుపు నల్లేరు మీద నడకే. అయితే పోటీయే పెట్టకుండా ముద్దుకృష్ణమను ఏకగ్రీవం చేసి ఆయన పట్ల వైసీపీ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఆరు నెలల వ్యవధిలో జరగబోయే ఎన్నికల్లో ఏకగ్రీవానికి అవకాశముందా? ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే విషయంపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి.
Tags:Who will replace his deficit?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *