Within 24 hours the wall became color

24 గంటల్లోనే ఆ గోడ ‌రంగు మారింది

హజ్‌ కార్యాలయానికి కాషాయ రంగుపై వెల్లువెత్తిన విమర్శలు

ఈనాడు.

Date :07/01/2018

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని హజ్‌ సమితి కార్యాలయం ప్రహారి గోడకు వేసిన రంగుపై వివాదం రేగింది. దీంతో ఒక్కరోజులోనే ఆ గోడ రంగు మార్చి తిరిగి పాత రంగు వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రాష్ట్ర శాసనసభ భవనానికి ఎదురుగా ఉన్న హజ్‌ సమితి కార్యాలయం ప్రహరి గోడకు రాత్రికి రాత్రే కాషాయ రంగు వేశారు. సచివాలయ భవంతికి వేసిన రంగునే ఈ గోడకు కూడా వేశారు. అయితే ముస్లింలకు చెందిన కార్యాలయానికి కాషాయ రంగు వేయడంపై విపక్ష నేతలు, ముస్లిం మతపెద్దల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో హజ్‌ కమిటీ కార్యదర్శి ఆర్పీ సింగ్‌ వెంటనే చర్యలు చేపట్టారు. ఆ గోడ రంగును పూర్వపు రంగులోకి మార్చారు. దీనంతటికీ కాంట్రాక్టరే కారణమని, అతడిపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.

హజ్‌ కార్యాలయానికి కాషాయ రంగు వేయగానే అక్కడి ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. ‘ఏంటిది.. భాజపా కాషాయం రంగు వేసింది. భవిష్యత్‌లో ఎస్పీ ఆకుపచ్చ, బీఎస్పీ నీలం రంగు వేస్తాయి.ఇవి రాజకీయ రంగులు. వీటిని హజ్‌ కార్యాలయాలకు వేయడం ఏమిటి? ఇలాంటివి నివారించాలి’ అని ఆల్‌ ఇండియా షియా పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధి యాసూబ్‌ అబ్బాస్‌ మండిపడ్డారు. ‘కాషాయం రంగు ఓ రాజకీయ పార్టీకి చెందినది. హజ్‌ యాత్రికులు కూడా కాషాయ రంగు దుస్తులు వేసుకోవాలని వారు కోరుకుంటున్నారా?’ అని మరో ముస్లిం మతపెద్ద ఖాజీ మౌలానా ప్రశ్నించారు.

విపక్షాలు కూడా ప్రభుత్వ చర్యపై మండిపడ్డాయి. రంగులు మార్చే పార్టీగా భాజపాకు పేరుందని ఎస్పీ నేత సునీల్‌ సింగ్‌ ఆరోపించారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హజ్‌ కార్యాలయం గోడకు శుక్రవారం కాషాయ రంగు వేయగా… 24 గంటల్లోనే అంటే శనివారమే పాత రంగులోకి మార్చివేశారు.

Tags : Within 24 hours the wall became color

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *