Worried about women's safety?

మహిళల భద్రతకు భరోసాయేదీ?!

-అమలుకు నోచుకోని వర్మ సిఫార్సులు
-నిర్భయ కేసు తర్వాత కఠిన చర్యలు శూణ్యం

Date: 21/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

మహిళల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కదిలింది. జస్టీస్ వర్మ కమిటి చేసిన విస్తృత సిఫార్సులకు సంబంధించి ఆర్డినెన్స్‌ను రూపొందించడం, దాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే రాష్టప్రతి ఆమోదానికి పంపడం ఈ దిశలో మొదటి అడుగు. ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉద్యమ సెగలు రగులుకున్నాయి. మహిళకు రక్షణ లేదంటూ వీధికెక్కిన లక్షలాది మంది ఢిల్లీ అత్యాచార నిందితులందరికీ మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేయడమే ప్రభుత్వం కదలికకు కారణమైంది. మొత్తానికి వర్మ సిఫార్సులను ఆమోదించడం ద్వారా ప్రభుత్వం ఏమి సాధించదలచుకుందనే దాని కంటే కొన్నింటిని విస్మరించడం ద్వారా ఏమి సాధించాలని భావించిందో అర్థం కాని పరిస్థితే. సిఫార్సులన్నింటినీ అమలు చేశామని ఆర్థిక మంత్రి చిదంబరం చెబుతున్నప్పటికీ కొన్నింటిపై ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నది నిజం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గట్టిగానే తన వాదనను వినిపించినప్పటికీ అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. ప్రస్తుతం ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టేందుకు ఈ ఆర్డినెన్స్ దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అత్యాచార బాధితురాలు మరణిస్తే దోషులకు మరణ దండన విధించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇది కొంత వరకూ సమస్య తీవ్రతను తగ్గించడంతో పాటు మహిళకు రక్షణ పరంగా ఊతాన్నిచ్చేదే. అయితే..సిఫార్సుల్లో ప్రభుత్వం దృష్టి పెట్టని లేదా ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వని అంశాలెన్నో ఉన్నాయన్నది స్పష్టం. ప్రజలు ఎంతగా గగ్గోలు పెట్టినా, ఆగ్రహావేశాలను వెళ్లగక్కినా తాను అనుకున్న పథంలోనే ప్రభుత్వం ముందుకెళుతుందన్న కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైవాహిక అత్యాచారాలు, పోలీసు సంస్కరణలు, మానభంగం ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రతాదళాల ప్రాసిక్యూషన్ వంటి అనేక అంశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందనడం నిస్సందేహం. ఇటీవలి కాలంలో భద్రతాదళాలపై వస్తున్న ఆరోపణలు, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోని ధోరణి తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో వర్మ సిఫార్సుల్లోని ఈ అంశాలను ప్రభుత్వం ఎందుకు ఆర్డినెన్స్‌లో చేర్చలేదన్నది దాని నిజాయితీని శంకించేందుకు ఆస్కారం ఇచ్చేదే. నేరం ఎవరు చేసినా నేరమే. అందుకు కఠినంగా శిక్ష పడాల్సిందే. కానీ వర్మ సిఫార్సుల్ని ప్రభుత్వం పూర్తిగా అమలు చేసి ఉన్నట్టయితే సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం ప్రస్తుత రూపంలో నిలిచి ఉండేదే కాదు. పోలీసు వ్యవస్థ, పోలీసింగ్ విధానంలో కూడా ఆమూలాగ్రం మార్పులు రావడానికి ఆస్కారం ఉండేది. ఇంత కీలకమైన వాటిని అటకెక్కించడం లేదా వాటి ప్రాధాన్యతను పక్కన పెట్టడంలో ప్రభుత్వ ఉద్దేశం అంతుబట్టడం లేదు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను సంస్కరించాల్సిన అగత్యం నేటి వాతావరణంలో మరింత స్పష్టమవుతోంది. ఈ వ్యవస్థను ఎంత అర్థవంతంగా తీర్చిదిద్దితే అంతగానూ వ్యవస్థ ప్రక్షాళనం కావడానికి ఆస్కారం ఉంటుంది. నేర తీవ్రతను తగ్గించేందుకూ అవకాశం ఉంటుంది. కానీ వర్మ సిఫార్సుల్లో మెచ్చుకోలు సిఫార్సులకే పట్టం కట్టిన ప్రభుత్వం కఠినమైన వాటిని పక్కన పెట్టింది. వివాదానికి, వాదోపవాదాలకు ఆస్కారం ఇచ్చేవాటి జోలికి పోకుండా వర్మ సిఫార్సుల అమలుకు సంబంధించి గట్టెక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందనడం అతిశయోక్తి ఏమీ కాదు. వేటి వల్ల అయితే ఎక్కువ స్థాయిలో వివాదం చోటు చేసుకునే అవకాశం ఉండదో వాటినే కొన్ని మార్పులతో ఆర్డినెన్స్ రూపంలో తెరపైకి తేవడానికే ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందనడం ఎంతైనా వాస్తవం. అంతే కాదు, వీటిపై ఎలాంటి తదుపరి చర్చకు ఆస్కారం లేకుండా హడావుడిగా ఆర్డినెన్స్‌ను రాష్టప్రతి ఆమోదానికి, అనంతరం అమలుకు సిద్ధమైపోవడం విడ్డూరంగా ఉంది. మహిళలకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలంటే ఏమి చేయాలన్నది వర్మ సిఫార్సుల ప్రాతిపదికగా విస్తృతంగా చర్చించి నిర్ణయించాల్సిన అంశం. కూలంకషంగా చర్చజరిగితేనే, అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటేనే ఏ చట్టానికైనా, ఆర్డినెన్స్‌కైనా అర్థం ఉంటుంది. ఆంతే కానీ, హడావుడి చర్యల వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటో ప్రభుత్వానికే తెలియాలి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఎలాంటి ఆర్డినెన్స్‌పైనా రాష్టప్రతి సంతకం చేయడానికి వీల్లేదంటూ తాజాగా వినిపిస్తున్న వాదనలకు ప్రభుత్వ సమాధానం ఏమిటో..? ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొన్న అంశాలతోనే మహిళలకు పూర్తి స్థాయి భద్రత చేకూరుతుందనుకోవడం పొరపాటే. వ్యవస్థాగతమైన లోపాలను తొలగించడం ద్వారా, అసంబద్ధతలను నివృత్తి చేయడం ద్వారా మాత్రమే పూర్తి స్థాయి ఫలితం చేకూరుతుంది. ఇందుకు సంబంధించి సిఫార్సుల్లోని అనేక అంశాలున్నా..వాటిని ప్రభుత్వం పక్కన పెట్టినా వాటిని విస్మరించడానికి మాత్రం వీల్లేదు. మొత్తం సామాజిక సంస్కరణల్లో భాగంగానే వీటిని పరిగణించి తదుపరి చర్చల ద్వారా అమలుకు ఆస్కారం ఇవ్వడం ఎంతైనా అవసరం. అన్నింటికంటే విస్మయకర అంశమేమిటంటే ఆర్డినెన్స్ అమలు గతంలో జరిగిన నేరాలకూ వర్తిస్తుందా లేక కొత్తగా జరిగే వారికే అమలు అవుతుందా అన్నది! చిదంబరం వ్యాఖ్యానాలను బట్టి చూస్తే దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మానభంగం, హత్య నేరస్తులకు ఇది వర్తించదన్న విషయం స్పష్టమవుతోంది.

Tags : Worried about women’s safety?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *