.అంగన్‌వాడీలకు ఉపశమనం

Date:13/04/2018
కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతుల లేమి తాండవిస్తోంది. ఉష్ణోగ్రతలు విజృంభిస్తుండడంతో సమస్యలు మరింతగా తీవ్రమయ్యాయి. ఇరుకు గదులు, మంచినీటి కొరత, ఉక్కపోతలతో చిన్నారులేకాక సిబ్బందీ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఈ దుస్థితి గమనించిన సంబంధిత అధికార యంత్రాంగం అంగన్‌వాడీలను ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచీ ఆదేశాలు జారీ అయ్యాయి. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ వెసులు బాటు కల్పించినట్లు చెప్పారు. ఉష్ణోగ్రతలో చోటుచేసుకున్న మార్పులతో కేంద్రాల్లో సరైన వసతులు లేక పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో వచ్చే నెల 31 వరకు అంగన్‌వాడీలు ఒంటిపూటే కొనసాగుతాయి.
కామారెడ్డిలో 1193 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్‌లో 1500 ఉన్నాయి. ఇరు జిల్లాల్లో అనేక కేంద్రాలకు సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా కొన్ని కేంద్రాలు ఇరుకు గదుల్లో ఉండటంతో పిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫ్యాన్ల సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదారులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. దీనికితోడు ఒకే గదిలో గర్భిణులు, పిల్లలు, బాలింతలు భోజనం చేయడం ఇబ్బందిగా మారుతోంది. వేసవిలో ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ అంగన్‌వాడీలను ఒంటిపూటే నిర్వహించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అవడంతో అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వ సూచనల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 7 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. 12 గంటల తరువాత చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందిస్తారు.
Tags:.About the Angers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *