పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

సాక్షి

Date :17/01/2018

సెంచూరియన్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ఐదోరోజు ఆట ఆరంభంలోనే భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. పుజారా(19) రనౌట్‌ అవ్వగా, భారీ షాట్‌కు యత్నించి పార్దీవ్‌ పటేల్‌, పాండ్యాలు అవుటయ్యారు. భారత్‌ 83పరుగులకు 6 కీలక వికెట్లు నష్టపోయింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 258 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ ఎదుట 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

భారత్‌ ఓపెనర్లు మురళి విజయ్‌(9), కేఎల్‌ రాహుల్‌(4)లు మరోసారి విఫలమవ్వగా.. తొలి ఇన్నింగ్స్‌లో  సెంచరీతో గట్టెక్కించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(5) సైతం నిరాశపరిచాడు. ఐదో రోజు ఆట ఆరంభంలోనే పుజారా, పార్దీవ్‌ పటేల్‌, పాండ్యాలు అవుటయ్యారు. రోహిత్‌ శర్మ, అశ్విన్‌లు క్రీజ్‌లో ఉన్నారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి, రబడాలు తలా 2 వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 335 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 258 ఆలౌట్‌
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 307, రెండో ఇన్నింగ్స్‌ 83/6

Tags : India is in trouble

సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌

16/1/2018 ఈనాడు సెంచూరియన్‌: ఆతిథ్య దక్షిణాఫ్రికాతో చివరి టెస్టుకు దినేశ్‌ కార్తీక్‌ అందుబాటులో ఉండనున్నాడు. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయపడటంతో అతని స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ మూడో టెస్టు కోసం తీసుకున్నట్లు ఆల్‌ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తన ట్విటర్‌ ద్వారా ప్రకటన వెల్లడించింది.

‘జనవరి 11న నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో వికెట్‌ కీపర్‌ సాహా ఎడమకాలి తొడ కండరాలు పట్టేశాయి. బీసీసీఐ మెడికల్‌ సిబ్బంది అతన్ని పరీక్షిస్తున్నారు. సాహా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దీంతో జనవరి 24 నుంచి జరగబోయే చివరి టెస్టుకు సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నాం’ అని బీసీసీఐ పేర్కొంది.

జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్‌ మైదానంలో జనవరి 24 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య చివరి టెస్టు జరగనుంది. సెంచూరియన్‌లో ప్రస్తుతం జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోన్న సంగతి తెలిసిందే.

టీమిండియాలో ఛేంజ్‌.. దినేశ్‌ కార్తీక్‌కు పిలుపు!

సాక్షి

Date :16/01/2018

జోహాన్నెస్‌బర్గ్‌: వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు పిలుపు అందింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న వృద్ధిమాన్ సాహా ట్రైనింగ్‌ సెషన్‌లో గాయపడటంతో అతని స్థానంలో కార్తీక్‌ను పంపాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో దినేశ్‌ కార్తీక్‌ ఫ్లయిట్‌ ఎక్కి.. మూడో టెస్టులోపు జట్టులో చేరబోతున్నాడు.

తొలి టెస్ట్ తర్వాత ప్రాక్టీస్‌ చేస్తుండగా సాహా మోకాలికి గాయమైంది. దీంతో అతన్ని రెండో టెస్ట్‌కు పక్కనపెట్టి పార్థివ్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడో టెస్ట్‌కు కూడా సాహా దూరం కానున్నాడు. ఈలోగా బీసీసీఐ మెడికల్ టీమ్ సాహా పరిస్థితిని సమీక్షించి.. అతన్ని దక్షిణాఫ్రికా టూర్‌లో కొనసాగించాలా? వద్ద అన్నది నిర్ణయం తీసుకోనుంది. తొలి టెస్ట్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా.. వికెట్‌ కీపర్‌గా సాహా రాణించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 0-1 తేడాతో వెనుకబడి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండోటెస్టు రసకందాయంలో పడింది. సఫారీలు మొదటి ఇన్నింగ్స్‌లో 335పరుగులు చేయగా, భారత్‌ 307 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు రెండు వికెట్లకు 90పరుగులు చేసి.. పట్టుబిగించే దిశగాసాగుతున్నారు.

Tags : Call to Dinesh Karthik