టీమిండియాలో మళ్లీ బ్రదర్స్ 

Date:05/02/2019
ముంబై ముచ్చట్లు:
భారత్ జట్టులో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ‘బ్రదర్స్‌’ ఆడబోతున్నారు. అప్పట్లో మోహిందర్ అమరనాథ్, సురీందర్ అమరనాథ్.. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున మైదానంలో మెరిశారు. మళ్లీ ఇన్నాళ్లకి హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య రూపంలో ‘బ్రదర్స్’ సందడి చేయనున్నారు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుండగా.. జట్టులోకి హార్దిక్, కృనాల్ ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో గత మూడేళ్లుగా ముంబయి ఇండియన్స్ తరఫున ఈ పాండ్యా బ్రదర్స్ ఆడుతున్నారు. కానీ.. భారత్ తరఫున ఇద్దరూ కలిసి ఆడబోతుండటం ఇదే తొలిసారి..!
కృనాల్ కంటే హార్దిక్ పాండ్య రెండేళ్లు చిన్నవాడైనప్పటికీ అతని కంటే ముందే టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. 2016, జనవరి 26న ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ జట్టులోకి హార్దిక్ పాండ్య ఎంట్రీ ఇవ్వగా.. కృనాల్ పాండ్య గత ఏడాది నవంబరు 4న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. వాస్తవానికి ఇంగ్లాండ్‌తో గత ఏడాది జరిగిన టీ20 సిరీస్‌లోనే ఇద్దరూ కలిసి ఆడాల్సింది. కానీ.. ఆ సిరీస్‌కి కృనాల్‌ ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇటీవల గాయం, ఆ తర్వాత సస్పెన్షన్‌తో ఒకింత ఒత్తిడికి గురైన హార్దిక్ పాండ్య గత ఆదివారం న్యూజిలాండ్‌తో ముగిసిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో బ్యాట్, బంతితోనూ రాణించి మళ్లీ లయ అందుకున్నాడు. మరోవైపు కృనాల్‌ పాండ్య కూడా గత నెలలో ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో.. ఇద్దరూ రేపు మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది..!
Tags:Brothers again in India team

నిన్న అబ్బాయిలు…ఇవాళ అమ్మాయిలు

Date:29/01/2019
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
న్యూజిలాండ్‌ గడ్డ మీద భారత క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. కోహ్లి సేన ఐదు వన్డేల సిరీస్‌ను వరుస విజయాలతో 3-0తో కైవసం చేసుకున్నట్టుగానే.. మహిళల జట్టు కూడా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుపొందింది. తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో నెగ్గిన మిథాలీ సేన.. రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బే ఓవల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు 44.2 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ అమీ సటెర్త్‌వైట్ (71) మాత్రమే రాణించింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి 3 వికెట్లు పడగొట్టగా.. ఏక్తా బిస్త్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు తలో రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ జెమిమా రోడ్రిగ్యూస్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. దీప్తి శర్మ కూడా 8 రన్స్‌కే పెవిలియన్ చేరింది. కానీ స్టార్ ప్లేయర్ స్మృతి మంధనా (90 నాటౌట్), కెప్టెన్ మిథాలీ రాజ్ (63 నాటౌట్) భారత్‌కు విజయాన్ని అందించారు. తొలి వన్డేలోనూ స్మృతి మంధనా అద్భుత శతకంతో జట్టును గెలిపించింది. 193 పరుగుల లక్ష్య చేధనలో ఓపెనర్లు జెమీమా (81 నాటౌట్), మంధనా (105) మెరవడంతో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Tags:Yesterday boys … today girls

టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ 

Date:29/01/2019
దుబాయ్‌ ముచ్చట్లు:
ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే పురుషుల, మహిళల ప్రపంచ కప్‌ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ జట్లు ఉన్న కఠినమైన గ్రూప్‌ 2లో కోహ్లీ సేనను చేర్చారు. ఈ గ్రూప్‌లో ఆ మూడు జట్లతోపాటు మరో రెండు అర్హత సాధించే జట్లు ఉండనున్నాయి. దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరో వైపు భారత మహిళల జట్టును గ్రూప్‌ ఏలో చేర్చారు. తొలి మ్యాచ్‌లోనే భారత్‌ కఠిన జట్టును ఎదుర్కోనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది.ఆస్ట్రేలియాలో తొలిసారిగా మహిళల, పురుషుల టీ20 ప్రపంచ కప్‌లను ఒకే ఏడాది, ఒకే దేశంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లను మెల్‌బోర్న్‌ స్టేడియంలోనే నిర్వహించనుండటం విశేషం. మహిళల ప్రపంచ కప్‌లో మొత్తం పది జట్లు 23 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ తలపడనున్నాయి. ఇక పురుషుల ప్రపంచకప్‌ అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగనుంది.
Tags:The ICC announced the T20 World Cup match schedule

వన్డే సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత్ జట్టు

Date:28/01/2019
న్యూజిలాండ్ ముచ్చట్లు:
ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల టెస్టు, వన్డే సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత్ జట్టు.. న్యూజిలాండ్‌లోనూ అదే జోరుని కొనసాగిస్తూ వన్డే సిరీస్‌‌ని చేజిక్కించుకుంది. మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా సోమవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ (62 : 77 బంతుల్లో 3×4, 2×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ(60 : 74 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకాలు బాదడంతో న్యూజిలాండ్‌ని 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. రాస్‌ టేలర్ (93: 106 బంతుల్లో 9×4), టామ్ లాథమ్ (51: 64 బంతుల్లో 1×4, 1×6) అర్ధశతకాలు బాదినా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో 49 ఓవర్లలో 243 పరుగులకే కుప్పకూలిపోగా.. లక్ష్యాన్ని భారత్ మరో 42 బంతులు మిగిలి ఉండగానే 245/3తో అలవోకగా ఛేదించేసింది. ఏడు వికెట్ల తేడాతో కివీస్ ను చిత్తు చేసి ఐదు వన్డేల సిరీస్ ను మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243 పరుగులు చేయగా, భారత్ మూడు వికెట్లు కోల్పోయి మరో 42 బంతులు మిగిలి ఉండగానే 245 పరుగులు చేసింది.అంబటి రాయుడు 40 పరుగులతో, దినేష్ కార్తిక్ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా, సాంత్నార్ కు ఒక్క వికెట్ లభించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బ్యాట్స్ మెన్ న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. టీమిండియా కెప్టెన్  కోహ్లీ దూకుడుగా ఆడే క్రమంలో 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 3వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత విజయానికి ఇంకా 73 పరుగులు చేయాల్సి ఉంది. అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ లాంఛనాన్ని పూర్తి చేశారు. జోరు మీదున్న ఓపెనర్ రోహిత్ శర్మ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బోల్ట్ బౌలింగ్‌లోఔటయ్యాడు. దీంతో 113 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడినట్లయ్యింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీని సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
రెండో వికెట్‌కు కోహ్లీ, రోహిత్ శర్మ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో ధాటిగా ఆడుతున్న రోహిత్ 61 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 3 ఫోర్లు, 1 సిక్స్ అన్నాయి. రెండో వికెట్‌కు రోహిత్, కోహ్లీ కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 6 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీదున్న శిఖర్ ధావన్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బోల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ పై జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 243 పరుగులకు చేతులెత్తేసింది. విజయానికి భారత్ 244 పరుగులు చేయాల్సి ఉంది. రెండు పరుగులు చేసిన బౌల్ట్ భువనేశ్వర్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, చాహల్, హార్డిక్ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు.న్యూజిలాండ్ 239 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోోయింది.
తొలుత సోధిని 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొహమ్మద్ షమీ అవుట్ చేయగా ఆ తర్వాత బ్రాస్ వెల్ ను  15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ రన్నవుట్ చేశాడు.వరుసపెట్టి వికెట్లు పడుతున్నా.. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన రాస్ టేలర్ 93 పరుగులు చేసి ఔటయ్యాడు.షమీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన టేలర్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మిచెల్ సాంట్నర్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. పాండ్యా బౌలింగ్‌లో కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అతను ఔటయ్యాడు. భారత్ పై సోమవారం జరిగిన మూడో వన్డే మ్యాచులో న్యూజిలాండ్ 191 పరుగుల వద్ద ఐదో వికెట్ ను జారవిడుచుకుంది.హార్దిక్ పాండ్యా బౌలింగులో నికోల్స్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన టామ్ లాథమ్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దీంతో 119 పరుగుల వద్ద కివీస్ నాలుగవ వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. వరుసపెట్టి వికెట్లు పడుతండటంతో టేలర్ తన సహజ దూకుడుకు విరుద్ధంగా నిదానంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కెప్టెన్ విలియమ్సన్‌తో 33, లాథమ్‌తో 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ అర్థసెంచరీలో 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత రాస్ టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న కెప్టెన్ విలియమ్సన్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో హార్డిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 33 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమవుతూ వచ్చిన ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఈ మ్యాచ్‌లోనూ అదే తంతు కొనసాగించాడు. ఒక ఫోర్, ఒక సిక్స్‌తో  క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినప్పటికీ ఆ ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఫోర్ కొట్టి ఊపు మీదున్న ఓపెనర్ మున్రో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.టాస్ గెలిచిన కివీస్ సారథి విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Tags:India is the team that has created the history of the ODI series

అరుదైన రికార్డ్ లో ధోని

Date:26/01/2019
ముంబై  ముచ్చట్లు:
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అరుదైన వన్డే రికార్డ్‌లో టాప్-3లోకి ప్రవేశించాడు. న్యూజిలాండ్‌‌తో మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా శనివారం జరుగుతున్న రెండో వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ 33 బంతుల్లో 5×4, 1×6 సాయంతో అజేయంగా 48 పరుగులు చేశాడు.  మ్యాచ్‌ ఆడటం ద్వారా భారత్ తరఫున అత్యధిక వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన మూడో క్రికెటర్‌గా ధోనీ రికార్డుల్లో నిలిచాడు. 2004, డిసెంబరు 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ.. ఇప్పటి వరకూ భారత్ తరఫున 334 వన్డేల్లో ఆడాడు. వాస్తవానికి ఈ మాజీ కెప్టెన్ కెరీర్‌లో ఇప్పటికే 337 వన్డే మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇందులో మూడు మ్యాచ్‌లు ఆసియా ఎలెవన్ తరఫున ఆడినవి. భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 463 వన్డేలతో అగ్రస్థానంలో ఉండగా.. అతని తర్వాత రాహుల్ ద్రవిడ్ 340 మ్యాచ్‌లతో ఉన్నాడు. తాజాగా ఈ జాబితాలో 334 మ్యాచ్‌లతో మూడో స్థానంలోకి ఎగబాకిన ధోనీ.. మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ సరసన నిలిచాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. అప్పటి నుంచి కేవలం వన్డే, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. ఈ ఏడాది మే నెలలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tags:Dhoni in rare record

రెండో వన్డేలోనూ భారత్ జట్టు ఘన విజయం

Date:26/01/2019
న్యూజిలాండ్  ముచ్చట్లు:
మైదానం మారినా టీమిండియా ప్రదర్శనలో మాత్రం జోరు తగ్గలేదు. అదే జోష్.. అదే ఉత్సాహంతో మరో మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించి ప్రత్యర్థిని మట్టికరిపించారు. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న న్యూజిలాండ్‌ను మరో వన్డేలో చిత్తుగా ఓడించి కోహ్లీసేన సత్తా చాటింది. న్యూజిలాండ్‌ గడ్డపై వరుసగా రెండో వన్డేలోనూ భారత్ జట్టు ఘన విజయం సాధించింది. మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ (87: 96 బంతుల్లో 9×4, 3×6), శిఖర్ ధావన్ (66: 67 బంతుల్లో 9×4), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (48 నాటౌట్: 33 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించడంతో 324 పరుగులు చేసిన భారత్.. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (4/45) చెలరేగడంతో న్యూజిలాండ్‌ని 234 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో.. 90 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా.. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగానే జరగనుంది. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శనివారం జరిగిన రెండో వన్డేలో భువనేశ్వర్ కుమార్(2 42), చాహల్(2/52) చైనామన్ బౌలర్ కుల్దీప్(4/45) యాదవ్‌ల ధాటికి కివీస్ 40.2 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలింది.
దీంతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ మార్టిన్ గప్తిల్(15)ను ఔట్ చేసి భువనేశ్వర్ భారత్‌కు శుభారంభం అందించాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో నిలకడగా కనీసం 50కి పైగా పరుగులు సాధిస్తూ వస్తున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులోకి రాగానే వేగంగా ఆడాడు. రెండు సిక్సర్లు బాది జోరు మీదున్న కేన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత మరో విధ్వంసకర ఓపెనర్ మున్రో(31)ను చాహల్ ఎల్బీడబ్లూగా వెనక్కి పంపడంతో 84 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో మిడిలార్డర్ పుంజుకోకుండా కివీస్ ఆటగాళ్లు టామ్ లాథమ్(34), హెన్రీ నికోల్స్(28), గ్రాండ్ హోం(3)లను పెవిలియన్ పంపి టీమిండియాకు విజయాన్ని ఖరారు చేశాడు. ఆఖర్లో బ్రాస్‌వెల్(57: 46 బంతుల్లో) ఫోర్లు, సిక్సర్లతో అర్ధశతకంతో మెరిసినా ప్రయోజనం లేకపోయింది.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 324 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బౌలర్లపై విరుచుకుపడి భారత ఆటగాళ్లు తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్(66) అర్ధశతకాలతో చెలరేగారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(43), అంబటి రాయుడు(47), ధోనీ(48 నాటౌట్), కేదార్ జాదవ్(22 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్ అందరూ 40కి పైగా స్కోరు సాధించడం భారత క్రికెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఫర్గుసన్ చెరో రెండు వికెట్లు తీశారు.
Tags:In the second ODI, India has been a huge success

భారత్ జట్టులో స్థానం కోసం పోటీ పెరిగింది : శిఖర్ ధావన్

టీమిండియాకు పెరిగిన గిరాకీ
Date:25/01/2019
ముంబై ముచ్చట్లు:
భారత్ జట్టులో స్థానం కోసం పోటీ పెరిగిందని సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో నేపియర్ వేదికగా గత బుధవారం జరిగిన తొలి వన్డేలో అజేయ అర్ధశతకం బాదిన ధావన్.. భారత్‌కి అలవోక విజయాన్ని అందించాడు. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే శనివారం ఉదయం జరగనుంది.. భారత్ జట్టులోకి గత ఏడాది ఆరంగేట్రం చేసిన రిషబ్ పంత్‌ ఇప్పటికే మెరుపు శతకాలతో టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. యువ ఓపెనర్ పృథ్వీషా ఆడిన తొలి టెస్టులోనే శతకం సాధించి సీనియర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌కి గట్టి పోటీగా మారాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్, హనుమ విహారి‌లు నిలకడగా రాణిస్తుండగా.. శుభమన్ గిల్, విజయ్ శంకర్ తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. జట్టులో ఎవరి స్థానానికీ భరోసా లేదని ధావన్ చెప్పుకొచ్చాడు.
మునుపటితో పోలిస్తే ఇప్పుడు యువ క్రికెటర్లలో పరిణతి కనిపిస్తోంది. ఎంతలా అంటే.. వారు సీనియర్ క్రికెటర్లకే గట్టి పోటీనిస్తున్నారు. పృథ్వీషానే చూడండి.. అరంగేట్రం టెస్టులో వెస్టిండీస్‌పై శతకం, ఆ తర్వాత మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. టీమ్‌లో 15 మంది ఆటగాళ్లే ఉన్నా.. తుది జట్టు కోసం పోటీ తీవ్రంగా ఉంది. న్యూజిలాండ్‌ పరిస్థితులు ఆస్ట్రేలియాని పోలి ఉంటాయి. గతంలో నేను ఇక్కడ పర్యటించాను. కాబట్టి.. ఆ అనుభవం నాకు ఇప్పుడు కలిరానుంది’ అని ధావన్ వెల్లడించాడు.
Tags:Competition for India’s position in the squad has increased: Shikhar Dhawan

టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చేదు అనుభవం

Date:19/01/2019
సిడ్ని ముచ్చట్లు:
ఆస్ట్రేలియా ఓపెన్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్రిడేషన్ మర్చిపోయిన ఫెదరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలో వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. గుర్తింపు కార్డు లేకపోవడంతో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఫెదరర్ కూడా తన సపోర్ట్ టీం సభ్యులు వచ్చే వరకు నిశ్శబ్దంగా అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లడానికి.. నేనే ‘రోజర్ ఫెదరర్’ అని ఫెడ్డీ నిరూపించుకోవాల్సి వచ్చిందిఫెదరర్ ఓపికగా నిలబడగా.. ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత గానీ ఫెడ్డీని లోపలికి అనుమతిచలేదు. ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. రోజర్ ఫెదరర్‌కి కూడా అక్రిడేషన్ కావాలంటూ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఆ గుర్తింపు కార్డుపై సంబంధిత వ్యక్తుల ప్రాథమిక సమాచారంతోపాటు బార్ కోడ్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ చెక్ పాయింట్లలో దాన్ని స్కాన్ చేస్తారు. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్లో నిలిపేశారు.
Tags:Tennis tycoon Roger Federer is a bad experience