ఆర్టీసిపై కరోనా పంజా

Date:03/05/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

టిఎస్‌ ఆర్టీసిపై కరోనా పంజా విసిరింది. కరోనా మహమ్మారి విజృంభణతో రోజురోజుకు ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. కరోనా వ్యాప్తి దృష్టా ఆర్టీసీలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా భయంతో ప్రజలు ఇళ్లనుంచి వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం డీజిల్ డబ్బులు కూడా రాని స్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిహెచ్‌ఎంసీ పరిధిలో తిరుగాడే సిటీ బస్సులలో సైతం పట్టుమని పది మంది ప్రయాణీకులు సైతం ప్రయాణించే పరిస్థితి కరవైందని చెబుతున్నారు. ఇక జిల్లాల పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదని తెలుస్తోంది.ఈ పరిస్థితుల్లో ఆయా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులను కుదించడం తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు. ప్రధానంగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను తగ్గిస్తున్నారు. ఎపితో పాటు మహారాష్ట్రకు బస్సు సర్వీసులను పూర్తిగా తగ్గించివేశారు. ప్రతి డిపోకు సగం బస్సులను మాత్రమే నడుపుతున్నారు. పట్టణంలో ఒక మోస్తరుగా పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. మరోవైపు రాష్ట్రం నుంచి ఆయా జిల్లాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను సైతం టిఎస్‌ఆర్టీసి రద్దు చేసుకుంటోంది. గతం కంటే భిన్నంగా ఈ మారు కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలెవరూ ఆర్టీసీ బస్సులవైపు కనీసం కన్నేయడం లేదని అంటున్నారు. దీంతో సగానికి సగం ఆక్యుపెన్సీ రేటు పడిపోయింది. డీజిల్‌కు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉత్పన్నమవుతోంది.

కాగా, ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి బస్సులను నడపాల్సి వస్తోంది. అయితే ఆయా డిపోలలో బస్సు సర్వీసులను కుదించడం తప్ప వేరే మార్గం టిఎస్‌ఆర్టీసికి కాన రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో తిరుగాడే బస్సు సర్వీసులలో 42 శాతం మేర సర్వీసులను టిఎస్‌ఆర్టీసి రద్దు చేసుకుంది. మరో మూడు, నాలుగు వారాలు కరోనా విజృంభణ కొనసాగే అవకాశముందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ కూడా రాని పరిస్థితిలో.. అసలే గత కొంతకాలంగా ఆర్థిక నష్టాలతో కునారిల్లుతున్న టిఎస్‌ఆర్టీసిపై కరోనా మరోమారు పంజా విసిరినట్లయింది. కాగా, గత కరోనా సమయంలోనే టిఎస్‌ఆర్టీసికి ప్రయాణీకులు దూరమయ్యారు. ఆ సమయంలో కరోనా భయంతో పలువురు తమ సొంత వాహనాలలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అలవాటు పడ్డారు.ఆ క్రమం నుంచి టిఎస్‌ఆర్టీసీ కోలుకుని ప్రయాణీకులను తనవైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ దిశగా కొనసాగేందుకు ఉపక్రమిస్తున్న తరుణంలో మళ్లీ కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ మొదలైంది. దీంతో టిఎస్‌ఆర్టీసికి మళ్లీ ప్రయాణీకులు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో బస్సు సర్వీసులను నడిపి తద్వారా కొంతమేరైనా నష్టాన్ని నివారించవచ్చని టిఎస్‌ఆర్టీసీ యోచనగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజావసరాల దృష్టా బస్సు సర్వీసులను నడుపుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రయాణీకులు రావడం లేదని బస్సు సర్వీసులను టిఎస్‌ఆర్టీసీ తగ్గించివేసింది. ఏది ఏమైనా టిఎస్‌ఆర్టీసీపై కరోనా తన పంజా బలంగా విసిరినట్లైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Corona claw on RTC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *