కంది కొనుగోళ్ల అక్రమాలపై కన్నెర్ర   

Date:14/04/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
రైతులను ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా వివిధ వ్యవసాయ దిగుబడులు కొనుగోలు చేస్తోంది తెలంగాణ సర్కార్. ఈ కేంద్రాల్లో పంట విక్రయించుకోవడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కర్షకులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను క్యాష్ చేసుకుంటున్నారు ప్రైవేట్ వ్యాపారులు. సర్కారీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి ముందే స్థానిక రైతుల నుంచి చౌకగా పంటను సేకరిస్తున్నారు కొందరు వ్యాపారులు, దళారులు. పొరుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ దిగుబడులను అత్యంత చౌక రేటుకు కొంటున్నారు. ఇలా సేకరించిన పంటను రైతుల పేరుతో మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. పలువురు సిబ్బంది కూడా వీరికి సహకరిస్తూ వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో పంటను కొంటున్నారు. ఈ విషయమై చాలా కాలంగా రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఆదిలాబాద్‌లో కొన్ని నెలల క్రితం సాగిన కంది కొనుగోళ్లలోనూ ఈ దందా సాగినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అవకతవకలకు పలువురు సిబ్బందిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ సైతం చేశారు. జిల్లాలో కిందటి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జరిగిన కందుల కొనుగోళ్లు వ్యాపారులకు కాసుల వర్షం కురిపించిందని రైతులు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు కందుల కొని ఇక్కడి మార్కెట్‌యార్డుల్లో మద్ధతు ధరకు విక్రయించడంలో మార్క్‌ఫెడ్‌, మార్కెట్‌ కార్యాలయ అధికారులకు భారీగా నగదు ముట్టజెప్పారని స్పష్టంచేశారు. ఇదిలాఉంటే కొందరు వ్యాపారులు బినామీ రైతుల పేరిట అధిక మొత్తంలో నాసిరకం కందుల్లో పశువులకు దానా, ఇసుకను కలిపి మార్కెట్‌యార్డు గోదాంలోనే రాత్రి సమయంలో అక్రమంగా తూకం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు మార్క్‌ఫెడ్‌ డీఎం గౌరీ నాగేశ్వర్‌ను ఆదిలాబాద్‌ బాధ్యతల నుంచి తప్పించారు. అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో సాగిన విచారణలో మార్కెట్‌కమిటీ కార్యదర్శితో పాటు గోదాం సూపర్‌వైజర్‌ పాత్ర ఉందని తేలింది. దీంతో వీరిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. రైతులకు మేలు చేయాలన్న ప్రభుత్వాశయానికి తూట్లు పొడిచేలా వ్యవహరించిన వారిపై వేటు పడడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తంచేసింది.
Tags:Connorrhea over the illegals acquisition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *