తప్పుంటే..కోతే..

Date:13/04/2014
పెద్దపల్లి ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాలను ప్రక్షాళిస్తోంది. అవకతవకలు ఆస్కారం లేకుండా సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకే అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే సర్కార్ రైతులకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తోంది. కొత్త పట్టాదారు పుస్తకాల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవకతవకలు, తప్పులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్నీ ఆదేశించింది. అంతేకాదు, పాస్‌పుస్తకాల ముద్రణలో పొరపాట్లు దొర్లితే ముద్రణ సంస్థదే బాధ్యతగా తేల్చింది. కొత్త పాస్ పుస్తకం అచ్చు వేయించి ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సర్వర్‌లోనూ వివిరాలు పక్కాగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వర్‌లో తప్పులుంటే తహసీల్దార్లదే బాధ్యత అని తేల్చి చెప్పింది. చిన్న తప్పు దొర్లినీ వేతనంలో కోతలు ఉంటాయంటోంది. దీంతో పాస్‌పుస్తకాల ముద్రణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది అధికార యంత్రాంగం.
స్థానికంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం 99 శాతం పూర్తైంది. డిజిటల్‌ సంతకాల నమోదు కొనసాగుతోంది. తప్పుల్లేకుండా తహసీల్దార్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. పని అచితూచి చేస్తున్నారు. సమగ్ర భూ సర్వేలో ఇప్పటివరకు పహాణీల్లో, ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలో తప్పులు దొర్లాయి. అయితే రెవెన్యూ అధికారులపై పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. కానీ పాసుపుస్తకాల్లో మాత్రం తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పులుంటే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఒకసారి వచ్చిన పాసుపుస్తకం శాశ్వతంగా ఉండేలా హైసెక్యూరిటీతో పాటు ఇతర ప్రత్యేకతలు ఉండేలా తయారుచేస్తున్నారు. పాస్‌బుక్‌లో రైతులకు సంబంధించిన సర్వే నంబర్‌, భూ విస్తీర్ణం, ఖాతాసంఖ్య, ఫొటో, మొబైల్‌ నంబర్ లాంటి వివరాలు పొందుపరస్తున్నారు. ఈ వివరాల నమోదులో ఏవైనా తప్పులు దొర్లితే ఒక్కో పాస్‌బుక్‌కు రూ.165 కోత విధించనున్నారు. ఒక్కో పుస్తకాన్ని ముద్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.165 ఖర్చు చేస్తోంది. దీంతో మళ్లీ ఈ-పాస్‌బుక్‌ ముద్రించేందుకు ఆ మొత్తాన్ని తహసీల్దార్‌ జీతంలో కోత విధిస్తే అధికారులు జాగ్రత్తగా ఉంటారన్నది సర్కార్ భావన. ఉన్నతాధికారులు దీనిపైన అధికారికంగా ఆదేశాలు ఇవ్వకున్నా రెవెన్యూ శాఖలో అంతర్గతంగా ఇది వర్తింపజేయనున్నారని సమాచారం.
Tags:Tappunte kote ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *