నిరంతర నిఘాలో పౌరసరఫరా 

Date:13/4/2018
ఖమ్మం ముచ్చట్లు:
పొరసరఫరాలు సజావుగా సాగేలా తెలంగాణ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రేషన్‌ను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసిన ప్రభుత్వం సరకులు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరా విభాగాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చింది. ఈ విభాగానికి చెందిన కార్యాలయాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం ద్వారా సరకులు అక్రమార్కుల చేతుల్లో పడవని భావిస్తోంది. ఇదిలాఉంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పౌరసరఫరా కార్యాలయంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లోఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు నిర్వహించే గోడౌన్లలో నిఘా కెమెరాలు బిగించారు. గోదాముల్లోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక ఖమ్మం విషయానికి వస్తే, జిల్లాలోని 8 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలను ఖమ్మంలోని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్వో) కార్యాలయంతో అనుసంధానం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయంతో అనుసంధానం చేశారు.
నిఘా కెమేరాల ఏర్పాటుతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలిసిపోతుంటుంది. బియ్యం నిల్వలు సహా గోదాముల్లోకి ఎవరెవరు రాకపోకలు సాగిస్తున్నారు? అక్కడ పని చేసేవారు, బియ్యం సహా ఇతర వస్తువుల నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి సులువుగా తెలిసిపోతుంది. ఇక రికార్డులో చూపించే మేరకు అక్కడ నిల్వలు ఉన్నాయా లేవా అనే అంశాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. సీసీ కెమేరాల ఫుటేజ్‌ ద్వారా పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించి సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. గోడౌన్లు బియ్యం సహా ఖాళీ గోనె సంచులు ఇతర సామగ్రి తస్కరణ, గోదాముల్లో బస్తాల నుంచి బియ్యం తగ్గించటం వంటి కార్యక్రమాలకు కొంతమేర చెక్ పడుతుంది. రేషన్ బియ్యం పక్కదోవ పట్టకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Tags:Citizenship in continuous surveillance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *