పల్లెవెలుగు

Date:08/10/2018
మెదక్ ముచ్చట్లు:
పల్లెసీమల్లో ప్రగతి కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. అయినా కొన్ని అంశాల్లో గ్రామాలు వెనుకబడే ఉన్నాయి. మరెన్నో రంగాల్లో మార్పుకు నాంది పలకాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వసతులు, సౌకర్యాలు ఏంటి..? ఇంకా ఏం కావాలి..? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రజా అంచనాలు అనే నినాదంతో గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే మహత్తర కార్యక్రమానికి తొలి అడుగు పడనుంది.
ఈఏడాది చివరి కల్లా వాటిని రూపొందించాలనే లక్ష్యంతో జిల్లాలోనూ అధికారులు కసరత్తు షురూ చేశారు. కార్యక్రమంలో భాగంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. మిషన్‌ అంత్యోదయ వివరాలు కూడా సేకరించాలి. ఈ క్రతువులో 17 శాఖల అధికారులు భాగస్వాములు కాబోతున్నారు.
ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు గ్రామానికో ఫెసిలిటేటర్‌ను నియమించనున్నారు. పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మహిళా  సంఘాల ప్రతినిధులు కూడా భాగస్వాములు కానున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీలు 469 ఉండగా వాటి పరిధిలో 7,00,477 మంది జనాభా ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈఏడాది డిసెంబరు 31వ తేదీలోగా గ్రామసభలు చేపట్టి ప్రజల సమక్షంలో అన్ని రంగాల్లోని అంశాలను వివరించాలి.
ఇంకా ఎలాంటి మార్పులు రావాలో వారి నుంచి వివరాలు సేకరించాలి. తొలి విడత చేపట్టిన గ్రామసభల ద్వారా ఓ నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత 17 శాఖల అధికారులు ప్రతి గ్రామానికి సంబంధించి 29 అంశాలపై సమగ్ర సమాచారం నమోదు చేయాలి. కీలక రంగాలన్నీ పరిధిలోకి వచ్చేలా దీన్ని రూపొందించారు. వ్యవసాయం, నీటిపారుదల,
ఆరోగ్యం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పశుగణాభివృద్ధి, గ్రామీణ పరిశ్రమలు, గృహ నిర్మాణం, రహదారులు, విద్యుదీకరణ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, పేదరిక నిర్మూలన పథకాల అమలు తీరు తదితరాలపై సమగ్ర సమాచారాన్ని అధికారులు సేకరించాల్సి ఉంటుంది. గ్రామాల్లో జనాభా, కుటుంబాలు, భౌగోళిక విస్తీర్ణం, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, అంతర్జాలం, టెలిఫోన్‌ సౌకర్యం లభ్యత, ఇళ్ల తీరు తదితర వివరాలు 17 శాఖల ఉద్యోగులు నమోదు చేయనున్నారు. నిర్దేశిత రంగాల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి…
మార్పు ఎలా తీసుకురావాలో నిర్దేశించాలి. దీని ఆధారంగా 2019-20లో చేపట్టాల్సిన పనులను నివేదిక రూపంలో తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి గ్రామంలోనూ సమాచార గోడలు ఏర్పాటు చేసి, వివిధ అంశాలు నమోదు చేసి, జియోట్యాగ్‌ చేసిన ఛాయచిత్రాలను అంతర్జాలంలో నమోదు చేయనున్నారు. దీనివల్ల గ్రామానికి సంబంధించిన ప్రతి అంశం పారదర్శకంగా ప్రజలకు తెలిసివస్తుంది. జిల్లాలో తొలివిడత గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
Tags: Palluvavar (Medak)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed