బకాయిల షాక్ 

Date;26/02/2020

మచిలీపట్నంముచ్చట్లు;

విద్యుత్తు శాఖకు బకాయిలు గుదిబండగా మారాయి. నెలనెలా జమ కావాల్సిన విద్యుత్తు బిల్లులు పేరుకుపోతున్నాయి. ఫలితంగా పాత బకాయిలు రూ.కోట్లకు చేరాయి. దీని వల్ల నష్టాలు తప్పడం లేదు. ఇవి పరోక్షంగా టారిఫ్‌ పెంచేందుకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచే సింహభాగం ఉంటోంది. దీంతో అధికారులు గట్టిగా డిమాండ్‌ చేయలేని పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థలకు విద్యుత్తు బిల్లులు చెల్లించడం తలకు మించిన భారంలా మారాయి.

బకాయిలు కొండలా పేరుకుపోవడంతో ఇటీవల ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులను కలసి సమస్యను విన్నవించారు. గత ఏడాది చివరి నాటికి చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రూ.433 కోట్లకు చేరింది. ఇవి సక్రమంగా జమకాకపోవడంతో ఎస్పీడీసీఎల్‌ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటోంది. ప్రధానంగా ప్రభుత్వ శాఖల నుంచే బకాయిలు అధికంగా ఉంటున్నాయి.

ఎల్‌టీ విభాగంలో అన్ని కలిసి రూ.408.48 కోట్లుగా తేలింది. ఇందులో నాలుగో విభాగం నుంచి అత్యధికంగా రూ.311.53 కోట్లు పేరుకుపోయాయి. 1వ విభాగంలో గృహ
కనెక్షన్లు, 2వ విభాగంలో వాణిజ్య, 3లో పరిశ్రమలు, నాలుగులో కుటీర పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, తదితరాలు, 5వ విభాగంలో వ్యవసాయ, అనుబంధ రంగ కనెక్షన్లు
వస్తాయి. ఎల్‌టీ1: రూ.32.46 కోట్లు, ఎల్‌టీ2: రూ.35.92 కోట్లు, ఎల్‌టీ3: రూ.22.33 కోట్లు, ఎల్‌టీ4: రూ.311.53 కోట్లు, ఎల్‌టీ5: రూ. 622.58 కోట్లు.
ప్రభుత్వ శాఖల్లో ఎల్‌టీ, హెచ్‌టీ కనెక్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం రూ. 98.17 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. స్థానిక సంస్థల నుంచి మరో రూ. 335.47 కోట్లు
రావాల్సి ఉంది. అన్నీ కలిపి రూ.433.64 కోట్ల వరకు పేరుకుపోయాయి. డిస్కమ్‌లకు విద్యుత్తు ఛార్జీల ద్వారా వచ్చే మొత్తం ద్వారానే ప్రధానంగా ఆదాయం సమకూరుతుంది. బిల్లులు  సక్రమంగా చెల్లించకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. నెలనెలా పేరుకుపోతున్న బకాయిలు.. చివరకు పెద్ద మొత్తానికి చేరుకుంటున్నాయి. జిల్లాలో ఎల్‌టీ కనెక్షన్లు 16.44  లక్షలు, హెచ్‌టీ కనెక్షన్లు 1,353 ఉన్నాయి. ప్రతి నెలా బిల్లులు సుమారు రూ. 210 కోట్లు, వినియోగం అధికంగా ఉండే వేసవిలో అయితే రూ.300 కోట్ల వరకు వస్తాయి. వీటిల్లో  ప్రభుత్వ శాఖల నుంచే ఎక్కువగా పెండింగ్‌లో ఉంటున్నాయి.

బిల్లుల వసూలు వంద శాతం వసూలు చేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు లక్ష్యం నిర్దేశిస్తున్నారు. ఎస్‌ఈ మొదలు  జేఈ వరకు బకాయిలపై ప్రతి నెలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నెలకు 95 శాతం వరకు వసూలు అవుతున్నాయి. మిగిలిన శాతం సకాలంలో వసూలు కావడం లేదు. స్థానిక  సంస్థ నుంచి ప్రతి నెలా రూ.7 కోట్లు, ప్రభుత్వ శాఖల నుంచి రూ.5కోట్లు చొప్పున మొత్తం రూ.12 వరకు బిల్లులు వస్తున్నాయి.

ఇవి సరిగా జమ కావడం లేదు. ఇటీవల ఎస్పీడీసీఎల్‌  సీజీఎం సచివాలయానికి వెళ్లి అన్ని శాఖల ఉన్నతాధికారులను స్వయంగా కలిసి, బకాయిల గురించి ప్రస్తావించారు. ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హాస్టళ్లు, వీధి దీపాలు, తదితర వాటికి కనెక్షన్లు తొలగిస్తే ప్రజలకు ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో విద్యుత్తు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ కేటాయింపులు పెద్దగా లేకపోవడంతో
విద్యుత్తు బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు.. ఏప్రిల్‌ నుంచి స్థానిక సంస్థలు, తాగునీటి పథకాలు, వీధి దీపాలు, ప్రభుత్వ
కార్యాలయాలకు టారిఫ్‌ పెంచారు. దీని వల్ల బిల్లులు మరింత పెరిగే అవకాశం ఉంది. పంచాయతీల పరిధిలో వీధి దీపాలకు కొత్తగా యూనిట్‌ ధర 5.95 నుంచి రూ.7, పురపాలికల్లో  రూ.6.50 నుంచి రూ.7 వరకు, సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్‌ పథకాలకు సంబంధించి పంచాయతీల్లో యూనిట్‌ ధర రూ.4.85 నుంచి రూ.7 వరకు, పురపాలికల్లో రూ.5.95 నుంచి రూ.7 వరకు, కార్పొరేషన్‌లో రూ. 6.50 నుంచి రూ.7 వరకు పెరిగింది. పెంపు వల్ల బిల్లుల బకాయిలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

 

Tags;Shock of dues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *