రోడ్డు ప్రమాదంలో 108 పైలట్ మృతి
అనంతపురం ముచ్చట్లు:
రోడ్డు ప్రమాదం అంటే.. తీవ్రతను బట్టి సెకండ్లు, నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయి. కాబట్టి.. క్షతగాత్రులను ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. ఇలాంటి వారిని రక్షించే 108 అంబులెన్స్ కు డ్రైవర్ అతను. ఎంత మందిని చావు నోట్లోంచి రక్షించాడో.. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఎన్ని గుండెలకు ఊపిరిలూదాడో లెక్కలేదు! అలాంటి 108 పైలట్.. ఇవాళ అదే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.అనంతపురం జిల్లాలో జరిగిందీ దుర్ఘటన.
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి గుమ్మగట్టకు వెళ్తున్న 108 వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 108 డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా..
108 వాహనంలో ఉన్న టెక్నీషియన్ మహేశ్ తలకు తీవ్ర గాయాలవడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బోలెరో వాహనం టమోటా లోడ్తో అనంతపురం వెళ్తుండగా బొలెరో ఛాసి రాడ్డు కట్ అయ్యి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న 108 అంబులెన్స్ను ఢీకొంది. మృతుడు బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడుతుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే నిన్న కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Tags: 108 pilot died in a road accident
