60 వేల ఫోన్ల కొనుగోలులో 15 కోట్ల స్కాం

15 crore scam in the purchase of 60,000 phones

15 crore scam in the purchase of 60,000 phones

Date:16/04/2018
గుంటూరు  ముచ్చట్లు:
ఏపీ స్త్రీ , శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల స్కాం బయిట పడింది.  అంగన్‌వాడీ కార్యకర్తలకు అందించే స్మార్ట్‌ఫోన్ల కొనుగోలులో రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖాధికారులు భారీగా కమీషన్లు కొట్టేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేసిన ఫోన్ల సంఖ్య 60 వేలకు పైనే అని తెలిసింది. ఈ లెక్కన చూస్తే స్మార్ట్ ఫోన్‌ల కొనుగోలులో నొక్కుడు రూ. 15 కోట్ల పైమాటేనని అంటున్నారు. దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల కార్యకలాపాలు ఒకేరకంగా ఉండేలా కామన్ అప్లికేషన్లతో కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా అంగన్‌వాడీ కార్యక ర్తలు తమ రోజువారీ కార్యక్రమాలను అప్‌లోడ్ చేయాలి. ఇదే ఇప్పుడు అవినీతికి ఆస్కారం కల్పించింది. ఫోన్ల కొనుగోళ్లలో కొంతమంది అధికారులకు భారీగా కమీషన్లు ముట్టాయని అంగన్‌వాడీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు అందించేందుకు వేల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేశారు. అందులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  రోజువారీ నిర్వహించే కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అప్‌లోడ్ చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు కార్బన్ కంపెనీకి చెందిన ఏయూఆర్‌ఏ 252 మోడల్ ఫోర్ జీ ప్లస్ ఫోన్‌లను అందజేశారు. అన్ని పన్నులతో కలిపి ఫోన్ గరిష్ఠ చిల్లర ధర ప్యాకెట్ మీద రూ. 6990గా ముద్రించి ఉంది. అయితే  ఆదే ఫోన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో రూ.4499కే దొరుకుతుంది. ప్రభుత్వం వేలసంఖ్యలో ఫోన్లు కొనుగోలు చేస్తుంది కాబట్టి  నేరుగా కంపెనీ నుంచే తీసుకుంటే రూ. 4000కే ఫోన్ లభ్యమయ్యే అవకాశాలున్నాయని అధికారులే చెబుతున్నారు.అయితే, విచిత్రంగా మార్కెట్‌లోని ఏ సామాన్య కొనుగోలుదారుడు కొనుగోలు చేయని విధంగా బాక్స్‌మీద ముద్రించిన రూ.6990కే ప్రభుత్వం ఈ ఫోన్లను కొనుగోలు చేసింది. ఈ లెక్కన చూస్తే ఒక్కో ఫోన్‌పై దాదాపు రూ. 3 వేల వరకు అవినీతి జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పోనీ.. కనీసం ఆన్‌లైన్ ధర రూ.4499కే కొనుగోలు చేసినా ఫోన్‌పై రూ.2500 తేడా ఉంది. ఒక్క విశాఖ జిల్లాకే 5236 ఫోన్లు కమిషనరేట్ నుంచి వచ్చాయి. ఈ జిల్లాలో తేడానే రూ. 1.30 కోట్లు ఉంది. పోనీ.. ఇంత డబ్బులు పోసి ఫోన్లు కొనుగోలు చేసిన అధికారులు ఆ స్మార్ట్‌ఫోన్‌లో అవసరమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారా అంటే అదీ లేదు. యాప్ ఇస్టలేషన్ పేరిట ఒక్కో ఫోన్‌కు రూ.41.30 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని సీన్‌సీ అనే ఏజెన్సీకి చెల్లించారు. ప్రస్తుతం దాదాపు అన్ని రకాల యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో ఉచితంగా అందుబాటులోకి వస్తున్నాయి. అయినా.. అంగన్‌వాడీ ఆయాల కోసం తయారుచేసిన యాప్ పేరిట కూడా సోమ్ముచేసుకోవడం మరీ విచిత్రం.ఫోన్ పోగొట్టుకొన్న అంగన్‌వాడీ కార్యక ర్తల నుంచి ఏడు వేల రూపాయలను వసూలు చేస్తామని ఐసీడీఎస్ అధికారులు స్పష్టం చేశారు. దీనిని బట్టి ఫోన్‌ను ఎంఆర్‌పీకే కొను గోలు చేశారని అర్థమవుతుంది. ఈ విషయమై విశాఖ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ చిన్మయదేవిని సంప్రదించగా కొనుగోళ్లతో తమకు సంబంధం లేదని, కేవలం జిల్లాకు వచ్చిన ఫోన్‌లను పంపిణీ చేయడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
Tags:15 crore scam in the purchase of 60,000 phones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *