రెండు వేర్వేరు ప్రాంతాల్లో 16ఎర్రచందనం దుంగలు స్వాధీనం
-ఇద్దరు అరెస్టు
తిరుపతి ముచ్చట్లు:

భాకరాపేట, రైల్వే కోడూరు అటవీ ప్రాంతాల్లోని రెండు ప్రాంతాల్లో 16ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీలు మురళీధర్, చెంచుబాలు అధ్వర్యంలో ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, కృపానంద లకు చెందిన రెండు టీమ్ లు కూంబింగ్ చేపట్టారు. రైల్వే కోడూరు నుంచి ఏఆర్ఎస్ఐ బాలచెన్నయ్య బృందం తుమ్మలబైలు బేస్ క్యాంపు నుంచి చాకిరేవుల మీదుగా కూంబింగ్ చేస్తుండగా, చిప్పగుండి అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, పోలీసులను కిందకు తోసి పారిపోసాగారు.
ఈ పెనుగులాటలో ఎం. అంకమరావు అనే కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. అయినప్పటికి పట్టువిడవకుండా ఇద్దరిని అందరూ కలసి పట్టుకోగలిగారు.
వారిని తమిళనాడు వేలూరు జిల్లా అనైకట్టుకు చెందిన స్వామినాథన్ గోవిందన్ (28), షన్ముగం పొన్నుస్వామి (52)లుగా గుర్తించారు. అక్కడ పడి ఉన్న 5ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో ఆర్ఎస్ఐ సురేష్ బాబు భాకరాపేట నుంచి బయలుదేరి యలమంద, పింఛా మీదుగా కూంబింగ్ చేస్తుండగా, జిల్లెల మంద వద్ద మామిడి తోటలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని హెచ్చరించి చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, దుంగలు పడేసి పారిపోయారు. అక్కడ 11ఎర్రచందనం దుంగలు లభించాయి. రెండు కేసులను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్లో నమోదు చేయగా, సీఐ బాలకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
Tags; 16 red sandalwood logs seized in two different areas
