200 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనతికాలంలోనే ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన భారత్‌ .. మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా.. దేశవ్యాప్తంగా 200 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన 18 నెలల్లో భారత్‌ 200 కోట్ల డోసులను పంపిణీ చేసి ఈ చరిత్ర సృష్టించింది. కరోనా నియంత్రణకు భారత్‌ ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా దేశంలో ఉచితంగా బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేస్తూ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ దస్తక్ లాంటి కార్యక్రమాలతో కోవిడ్ వ్యాక్సిన్‌ను దేశంలోని నలుమూలల కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు.జూలై 17మధ్యాహ్నం 12.30 గంటల వరకు భారత్‌లో 2,00,00,92,900 డోస్‌లను విజయవంతంగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఘనత సాధించిన దేశవాసులందరికీ హృదయపూర్వక అభినందనలంటూ ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా వీడియో ప్రసంగంలో తెలిపారు.

 

 

భారతదేశం ఇప్పటివరకు అందించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో 2 బిలియన్ డోస్‌లను అధిగమించడం దేశానికి గర్వకారణం అంటూ పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన ఆరోగ్య కార్యకర్తలు, పౌరులను అభినందించారు.దేశవ్యాప్తంగా  వ్యాక్సినేషన్ డ్రైవ్ 2021 జనవరి 16న ప్రారంభమైంది. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలు, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు టీకాలు వేశారు. ఆ తర్వాత మార్చి 1, 2021 నుంచి సీనియర్ సిటిజన్‌లకు (60 ఏళ్లు పైబడిన వారికి) వాక్సిన్ ఇచ్చారు. అనంతరం 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. మే 1, 2021 నుంచి 18 సంవత్సరాలు దాటిన పెద్దలందరికీ వ్యాక్సిన్ వేయడానికి అనుమతించారు. ఇలా దశల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ఏడాది జనవరి 3న, 15 – 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి, మార్చి 16న 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం అందరికీ.. కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

 

Tags: 200 crores vaccination completed

Leave A Reply

Your email address will not be published.