2020–23 Special Industrial Policy for SC, ST Entrepreneurs

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం

-జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్‌

Date:26/10/2020

అమరావతి ముచ్చట్లు:

ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వారిని ప్రోత్సహించేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమ పెట్టాలనుకున్న వారు.. ఎలా ముందుకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్‌, తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు.

 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం. వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫెసిలిటేషన్‌కార్యక్రమాలను చేపడుతున్నాం. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు… ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి.

 

ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి. వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం. సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. పూర్తి ఫీజు రియింబర్స్‌ మెంట్‌ అమలుచేస్తున్నాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, కుల,మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం. ఆసరా, చేయూత లాంటి పథకాలను ప్రవేశపెట్టాం.

 

అదే విధంగా మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్‌ను, పీ అండ్‌జీని, రిలయన్స్‌లాంటి సంస్థలను తీసుకువచ్చాం. అంతేగాక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

Tags:2020–23 Special Industrial Policy for SC, ST Entrepreneurs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *