శ్రీకపిలేశ్వరాలయంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు

Date:21/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్ర‌వారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.

తెల్లవారుజామున సుప్రభాతం అనంత‌రం 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉద‌యం 5.30 గంట‌ల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది.

ఘనంగా రథోత్సవం(భోగితేరు) :

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవం(భోగితేరు) కన్నులపండువగా జరిగింది. ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.

వేడుకగా స్నపనతిరుమంజనం :

ఈ సందర్భంగా అర్చకులు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. శ్రీస్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.

నంది వాహనం :

సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నంది వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుపతి పురవీధుల్లో ఈ వాహనసేవ నిర్వహిస్తారు. శ్రీకపిలేశ్వరస్వామివారికి నంది వాహనం ఎంతో విశేషమైనది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వాహనసేవకు హాజరవుతారు. రాత్రి 12 నుండి శ‌నివారం ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహిస్తారు.

ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించేందుకు, వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లు రూపొందించారు. భక్తులకు, నగరవాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ద్విచక్రవాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీవారి సేవకులు భ‌క్తుల‌కు అన్నప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల క్రమబద్ధీకరణ త‌దిత‌ర సేవ‌లందించారు.

ఫిబ్ర‌వ‌రి 22న శివపార్వతుల కల్యాణం :

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శ‌నివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.250/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ప్ర‌ధానార్చ‌కులు మ‌ణిస్వామి, సూపరింటెండెంట్‌ భూప‌తిరాజు, ఎవిఎస్వో  నందీశ్వ‌ర‌రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  రెడ్డిశేఖ‌ర్‌,  శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

Tags: Mahasivarathri celebrations at Srikapileswaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *