వైసీపీ నుంచి సుబ్బరామిరెడ్డి

Date:21/02/2020

విశాఖపట్టణం ముచ్చట్లు:

విశాఖను రాజకీయ కేంద్రంగా చేసుకున్న మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి దాదాపు పాతికేళ్ళ తరువాత పార్లమెంట్ కి దూరం కాబోతున్నారా అన్న చర్చ సాగుతోంది. టీఎస్సార్ 1996 నుంచి పార్లమెంట్ లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉన్నారు. టి సుబ్బరామిరెడ్డి రెండు సార్లు విశాఖ నుంచి లోక్ సభ సభ్యునిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా బాధ్యత‌లు నిర్వహించారు. ఇక యూపీయే హయాంలో ఒకమారు కేంద్ర గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. విశాఖ కేంద్రంగా నాలుగు దశాబ్దాల క్రితం రాజకీయ జీవితం ప్రారంభించిన టి సుబ్బరామిరెడ్డికి పట్టు దొరకడానికి పదేళ్ళకు పైగా కాలం పట్టింది.

 

 

 

 

ఇక టి సుబ్బరామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అతి ముఖ్యుడిగా భావిస్తూ అతి కొద్ది మందికి మాత్రమే లభించే మూడవసారి రాజ్యసభ అవకాశం కూడా కల్పించారు. అలా 2014లో ఆయన మరో మారు ఉమ్మడి ఏపీ నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ కి ఉన్న బలం వల్ల ఆయనకు ఇబ్బంది లేకపోయింది. ఇపుడు మాత్రం సీన్ అంతా రివర్స్ గా ఉంది. టి సుబ్బరామిరెడ్డిని మళ్ళీ ప్రమోట్ చేయాలనుకున్నా దక్షిణాదిన కర్నాటక తప్ప కాంగ్రెస్ కి వేరే చోటు లేదు. అక్కడ రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ కి వస్తాయనుకుంటే రేసులో ఉన్న వారు ఎక్కువమందే ఉన్నారు. పైగా కాంగ్రెస్ అక్కడ విపక్షంలో ఉండడంతో పోటీ దారుణంగా ఉంది. దాంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల నుంచి సుబ్బరామిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారుట.

 

 

 

అయినా ఒక్క శాతం అవకాశాలు కూడా లేవని భోగట్టా.అదెలా సాధ్యం అంటే రాజకీయాల్లో అన్నీ సాధ్యాలే అంటున్నారు. టి సుబ్బరామిరెడ్డి అజాతశత్రువు. ఆయన వైఎస్సార్ తో మంచిగా ఉండేవారు. జగన్ విషయంలో ఇప్పటివరకూ ఒక్క విమర్శా చేయని ఏకైక కాంగ్రెస్ నేతగా ఆయన కనిపిస్తారు. పైగా ఈ మధ్య జగన్ తో సాన్నిహిత్యాన్ని బాగా పెంచుకున్నారు. ఇంకో వైపు చూసుకుంటే విశాఖలో రాజధానికి టి సుబ్బరామిరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయనకు విశాఖతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన తోడుగా ఉంటే విశాఖ వంటి కాస్మోపాలిటన్ సిటీలో వైసీపీకి మంచి ఆదరణ కూడా దక్కుతుంది. మరి ఏప్రిల్ 9 తో టి సుబ్బరామిరెడ్డిఎంపీ సభ్యత్వం ముగుస్తుంది. ఆయన్ని ఏపీ కోటాలో జగన్ నామినేట్ చేస్తారా అన్న చర్చ కూడా ఉంది.

 

 

 

ఇక ఇక్కడ మరో విషయం ఉంది. విశాఖ శారదాపీఠం స్వామిజీ స్వరూపానందేంద్ర జగన్ కి రాజగురువుగా ఉన్నారు. ఆయన ఏమి చెబితే జగన్ అది చేస్తారు. ఇక స్వామిజీ ఆశ్రమం విశాఖలో పురుడు పోసుకోవడం వెనక నాటి కాంగ్రెస్ పెద్దగా, ఎంపీగా టి సుబ్బరామిరెడ్డి ఉన్నారు. స్వామిజీకి ఆయన ఇష్టుడు. టీఎస్సార్ సైతం స్వామిజీ భక్తుడు. ఇవన్నీ చూసుకున్నపుడు స్వామిజీ సహజంగానే టి సుబ్బరామిరెడ్డి ని రికమండ్ చేస్తారు. ఏపీ నుంచి వైసీపీకి వచ్చే నాలుగు ఎంపీ సీట్లలో ఒకటి టి సుబ్బరామిరెడ్డి కి ఇవ్వాలని గట్టిగా కోరే అవకాశాలు ఉన్నాయి.

 

 

 

అయితే టీఎస్సార్ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటేనే జగన్ ఎంపీ సీటుకు నామినేట్ చేస్తారు. మరి కాంగ్రెస్ అధినాయకత్వంతో బంధాలను తెంపుకుని టి సుబ్బరామిరెడ్డి వస్తారా? రాజకీయాల్లో పదవులు ముందు ముఖ్యం. ఆ తరువాతే బంధాలు, విధేయతలూ, అలా చూసుకున్నపుడు ఏమైనా జరగవచ్చు. ఎలాగైనా మళ్ళీ పార్లమెంట్ మెట్లు ఎక్కాలనుకుంటున్న టి సుబ్బరామిరెడ్డి వ్యూహాలేంటో చూడాలి.

జైల్లో ఆత్మహత్య డ్రామాకు తెరలేపిన నిర్భయ దోషి వినయ్ శర్మ

Tags: Subbaramyreddy from YCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *