ఈటల ఎపిసోడ్ లోకి హరీష్

0 28

హైదరాబాద్ ముచ్చట్లు :

ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతోంది. ఎక్కే గడప దిగే గడపగా రాజేందర్ అన్ని పార్టీలను సంప్రతిస్తున్నారు. పెద్ద నాయకులను కలుస్తున్నారు. రాజకీయాల్లో కేసీఆర్ ను ఎదుర్కొని నిలవడం కష్టమని ఆయనకు తెలుసు. అలాగని ఊరకనే చేతులెత్తేసే రకం కాదు. పైపెచ్చు టీఆర్ఎస్ నుంచే రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే ఆయనపై వేటు వేయాలని స్పీకర్ కు విన్నవించినట్లు నాయకులు చెబుతున్నారు. మొత్తమ్మీద రాజేందర్ ను వెంటాడే కార్యక్రమంలో చాలా వరకూ సక్సెస్ సాధించామని అగ్రనాయకులు భావిస్తున్నారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా మరో దశ విచారణలూ ప్రారంభం కావచ్చని అంతర్గత సమాచారం. ఏదేమైనా తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి రాజేందర్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది రాష్ట్రంలో చర్చనీయమవుతోంది. పన్నెండు సంవత్సరాలపాటు ఉద్యమ సహచరునిగా, ఏడు సంవత్సరాలపాటు మంత్రిగా రాజేందర్ తో కలిసి నడిచిన హరీశ్ రావును కూడా సమీకరించి పోరాటం చేయించాలనేది కేసీఆర్ ఎత్తుగడగా చెబుతున్నారు.రాజేందర్ రాజీనామా చేయక తప్పని అనివార్య పరిస్థితులను కేసీఆర్ కల్పిస్తారని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. ముప్పేట దాడిలో ఇప్పటికే ఈటల నిండా మునిగిపోయారు. ఎటు పాలు పోని స్తితి. మరో అస్త్రాన్ని ప్రయోగించడానికి టీఆర్ఎస్ అధినేత సిద్దమవుతున్నారని సమాచారం.

- Advertisement -

హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైతే జిల్లా మంత్రులతో పాటు దానిని పర్యవేక్షించే బాధ్యతలను హరీశ్ కు అప్పగించవచ్చని తెలుస్తోంది. హరీశ్ ట్రబుల్ షూటర్ గా గతంలో తనను తాను నిరూపించుకున్న ఉదంతాలున్నాయి. ఈటల రాజేందర్ దూకుడు కలిగిన నేత. అందులోనూ స్థానబలం కలిగిన చోట అతనిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. నిజానికి ఈ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కు అప్పగించడం సముచితం. అయితే రాజేందర్ సర్వశక్తులు ఒడ్డి గెలిస్తే కేటీఆర్ ప్రతిష్ఠకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలవడంతో హరీశ్ ప్రతిష్ట మసకబారింది. అదే విధంగా జీహెచ్ ఎంసీ బాధ్యతలను చూసిన కేటీఆర్ కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈటల ఉదంతాన్ని వీటితో పోల్చలేం. టీఆర్ఎస్ నాయకత్వంపైనే గురిపెట్టిన బాణం అతను. అందువల్ల డ్యామేజీ జరిగినా తక్కువ నష్టం తో బయటపడాలంటే హరీశ్ తోనే సేష్ గేమ్ ఆడాలనేది కేసీఆర్ ఆలోచన అంటున్నారు. సొంత నియోజకవర్గంలో ఈటలకు మంది మార్బలానికి కొదవ లేదు. ప్రతి నాయకుడు, కార్యకర్తతోనూ సంబంధాలు నెలకొల్పుకుని ప్రతివ్యూహం రచించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించగల సామర్థ్యం హరీశ్ కు ఉందని టీఆర్ఎస్ నాయకులు సైతం విశ్వసిస్తున్నారు.పార్టీని విడిచి పెట్టి బయటకు వెళ్లిన నాయకుల్లో చాలామంది అడ్రసులు గల్లంతయ్యాయి. వ్యక్తిగత ఇమేజ్ కలిగి, పెద్ద పదవులు నిర్వర్తించిన వారు సైతం తమ కాళ్లపై తాము నిలబడటానికే తంటాలు పడుతున్నారు. జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డి. శ్రీనివాస్ వంటి వారు రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యాన్ని కొల్పోయారు. నాయకత్వంతో విబేదించిన వీరెవరూ పెద్దగా ప్రజాక్షేత్రంలో నిలదొక్కుకోలేకపోయారు.

కేసీఆర్ కు చెక్ పెట్టగలమని నిరూపించుకుంటున్న దాఖలాలూ లేవు. తటస్థంగా వ్యవహరించే రాజకీయ పరిశీలకులు ఈటల రాజేందర్ వ్యవహారాన్ని సైతం అదే కోణంలో చూస్తున్నారు. ఉద్యమం నాయకులను తయారు చేస్తుంది. ఆ సమయం తర్వాత మామూలు రాజకీయాలే నడుస్తుంటాయి. దాని ప్రాధాన్యం తగ్గిపోతుంది. కోదండరామ్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్ర సాధనలో ఎంతో కీలక భూమిక పోషించిన వ్యక్తి కనీసం ఎమ్మెల్సీ గా కూడా గెలవలేక నిస్సహాయంగా మిగిలిపోయారు. అందుకే టీఆర్ఎస్ ను కేసీఆర్ పక్కా రాజకీయ పార్టీగా మార్చేశారు. సామదానభేద దండోపాయాలన్నిటినీ పార్టీలో ప్రవేశపెట్టారు. గత ఉద్యమం పేరుతో రాజకీయంగా తమ వాటాకు డిమాండ్ చేసేవారిని పక్కన పెట్టేశారు. ఆ జాబితాలో రాజేందర్ ది చివరి వికెట్. అధిష్ఠానం దయా దాక్షిణ్యాలపై ఆధారపడిన వారు మాత్రమే మిగిలారు.పార్టీలకు అతీతంగా అందరూ తనకు మద్దతు ఇవ్వాలని రాజేందర్ కోరుకుంటున్నారు. ఇది అత్యాశే. బీజేపీ, కాంగ్రెసులు ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఇరు పార్టీలు కుడి ఎడమలుగా ఈటలకు దన్నుగా నిలిచి గెలిపించే ప్రసక్తే ఉండదు. ఇక మద్దతు ఇద్దామనుకున్నా వామపక్సాలకు పెద్దగా ఉనికే లేదు. అందువల్ల సొంత బలంపైనే ఆధారపడి రాజేందర్ గెలవాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ అధికార బలం, హరీశ్ వ్యూహచాతుర్యం, స్తానికంగా ఎంపిక చేసే అభ్యర్థి సామాజిక బలం అన్నిటినీ ఎదిరించి గెలవాలి. అందుకే రాజీనామా చేసే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నారు రాజేందర్. ఎన్నికలో ఓటమి ఎదురైతే తన రాజకీయ జీవితం అక్కడితో ముగిసిపోతుంది. గెలిస్తే మాత్రమే ఉనికిని కాపాడుకోగలుగుతారు. అయినా ఏదో ఒక పార్టీ అండ లేకుండా రాష్ట్రస్తాయి ప్రభావం చూపే అవకాశమూ లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెసు నాయకులు ఈటలను తమ పార్టీల్లో చేరమని కోరుతున్నారు. ఇండిపెండెంట్ గా నిలిస్తే మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని ఇప్పటికే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెసు అగ్రనాయకులందరితోనూ ఈటల చర్చలు జరిపారు. మాటల సానుభూతి తప్ప నిన్ను గెలిపించే బాధ్యత తీసుకుంటామని ఏ రాజకీయ పార్టీ నేత చెప్పకపోవడం విశేషం.

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Harish into the episode of Yitala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page