బత్తాయి ధరలు పడిపోతున్నాయ్..

0 40

అదిలాబాద్ ముచ్చట్లు :
బత్తాయి రైతులను ఈసారి కరోనా చిత్తు చేసింది. కరోనా లాక్‌డౌన్‌తో అంతర్రాష్ట్ర ఎగుమతులు నిలిచి గిట్టుబాటు ధర పతనమైంది. మార్కెటింగ్‌ కల్పించి ఆదుకుంటామన్న పాలకులు మాట తప్పారు. ఏటా వేసవిలో టన్ను రూ.50-40 వేలకు అమ్ముడుపోయే బత్తాయి.. ప్రస్తుతం టన్ను రూ.6వేల నుంచి12వేలు మాత్రమే పలుకుతోంది. మూడొంతులకు ధర పడిపోవడం వల్ల కాయలు కోసినా ఏమీ మిగలదని రైతులు చెట్లపైనే వదిలేస్తున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రజల రోగనిరోధక శక్తి పెంపుదల కోసం ఇక్కడే పంటను కొని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కేసీఆర్‌ చెప్పారు. ఆ మేరకు రైతులకూ నష్టం జరగకుండా చూస్తానన్న హామీ అమలు కాలేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బత్తాయి సాగు 47వేల ఎకరాల విస్తీర్ణం. ఈ కత్తెర సీజన్‌లో దిగుబడి 43వేల మెట్రిక్‌ టన్నులు వస్తుందని అధికారుల అంచనా. ఆశించినమేర దిగుబడి ఉన్నా.. కరోనా నేపథ్యంలో ఢిల్లీ, నాగపూర్‌, చెన్నై, కలకత్తా, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. స్థానికంగా అమ్మకాలు చేసుకునే అవకాశమూ లేక బత్తాయి రైతులు కుదేలయ్యారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 21352 మెట్రిక్‌ టన్నుల బత్తాయిలను అష్టకష్టాలుపడి రైతులు వచ్చినకాడికి అమ్ముకున్నారు. ఇందులో 70 టన్నులు మాత్రమే జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు కొనుగోలు చేసి.. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు పంపిణీ చేశారు. పట్టణాల్లో అమ్మకాలు జరుపుతామని ప్రారంభించిన మొబైల్‌ మార్కెట్‌ ద్వారా 3930 టన్నుల విక్రయాలు జరిగాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో బత్తాయి మార్కెట్‌ను జిల్లా మంత్రి అర్భాటంగా ప్రారంభించిన మరుసటి రోజే మూతపడింది. ఢిల్లీలోని అజాద్‌పురా మండీకి ఏప్రిల్‌ చివరి వారం నుంచి మే మొదటి వారం వరకు 10రోజులపాటు జిల్లా నుంచి 5వేల టన్నుల వరకు రవాణా జరిగింది. కానీ, అంతలోనే అక్కడి వ్యాపారికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మార్కెట్‌ను మూసేశారు. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత ఢిల్లీ, కాన్పూర్‌, ఆగ్రా, హైదరాబాద్‌ ప్రయివేటు ట్రేడర్స్‌కు రైతులు 11,352 మెట్రిక్‌ టన్నుల బత్తాయిని అమ్మారు. ఇదే క్రమంలో లాక్‌డౌన్‌ సాకుతో వ్యాపారులు అతి తక్కువ ధరకు తీసుకుంటున్నారు.

మరోవైపు లాక్‌డౌన్‌ ఉన్నా మహారాష్ట్ర నుంచి కమలా, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్ల దిగుబడులు హైదరాబాద్‌ మార్కెట్‌కు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. దిగుబడులకు అడ్డుకట్ట వేయకుండా.. మరోవైపు స్థానికంగా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించకపోవడంతో 16,900 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 21,648 మెట్రిక్‌ టన్నుల కాయలు చెట్లపైనే ఉన్నాయి.ప్రస్తుత సీజన్‌లో బత్తాయి దిగుబడి కొంత పెరిగినా ధర లేనందున ఉపయోగం లేకుండా పోయింది. గతేడాది ఇదే సమయానికి టన్ను బత్తాయిలను తోటల దగ్గరనే దళారులు రూ.50-40వేల వరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రైతులే కూలీలను పెట్టి తెంచి రవాణా ఖర్చు భరించి మార్కెట్‌కు తీసుకెళ్లినా టన్న రూ.6 నుంచి రూ.12వేల లోపు కొంటున్నారు. చెట్ల నుంచి టన్ను బత్తాయి కాయలు కోయాలంటే 30 నుంచి 40 మంది కూలీలు పనిచేయాలి. రోజుకు ఒక కూలీకి రూ.400 చొప్పున చెల్లించాలి. కనిష్టంగా 30 మంది కూలీలతో కాయలు కోసినా రూ.12వేలు కూలీ ఖర్చులు అవుతాయి. కోసిన కాయలను కొత్తపేట మార్కెట్‌కు తరలించడానికి రూ.3వేలు రవాణా చార్జీ అవుతోంది. దీంతో కాయలు కోసి అమ్మినా కనీసం ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది రైతులు చెట్లపైనే వదిలేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags:Cotton prices are falling.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page