రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం

0 21

విశాఖపట్టణంముచ్చట్లు :

అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో.. ఆ ఊరి వాసులు ఓ నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా చందాలు వేసుకున్నారు. అంతేనా శ్రమదానం కూడా చేస్తున్నారు. ఇది కాస్తా చర్చనీయాంశమయ్యేసరికి తమ డిమాండ్‌ను మరింత గట్టిగా వినిపిస్తున్నారు.విశాఖ ఏజెన్సీ వాసులు…ఊరి రోడ్డు కోసం నడుం బిగించారు. పాడేరు నియోజకవర్గంలోని హుకుంపేట మండలం తిగలవలస పంచాయితీ పరిధిలోని గుర్రాల తోట గ్రామం ఇది. 300 మంది గిరిజనులు నివసముండే చిన్న గ్రామం గుర్రాల తోట. ఈ గ్రామం మిగతా గ్రామాలకు మూడు కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. గర్భిణీలు, వృద్ధులు, రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డోలీలో మోయాల్సిందే. సరుకులు కొనుక్కోవాలంటే కాలినడకన కొండ దిగాలి. ఇక్కడకు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్తుంటారు.కానీ వీరి గోడును పట్టించుకున్నది లేదు. ఏళ్లు గడుస్తున్నా రోడ్డు వేయకపోవడంతో స్థానికులంతా నడుం బిగించారు. పార, పలుగు తీసుకుని శ్రమదానం చేస్తున్నారు. ఒక్కో కుటుంబం ఐదారు వేల రూపాయలు జమచేసి ఆ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. బండరాళ్లను తొలగించేందుకు ప్రొక్లెయిన్లను అద్దెకు తీసుకొచ్చారు. సుమారు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో మూడు కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికైనా రాజకీయ నేతలు, అధికారులు స్పందించి తమ గ్రామానికి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.వర్షాకాలం వచ్చేస్తోంది. దీంతో.. యుద్ధప్రాతిపదికన బండరాళ్లు తొలగించి రోడ్డు నిర్మాణానికి అనువుగా చదును చేస్తున్నారు గుర్రాల తోట వాసులు. పెదబయలు మండలానికి చెందిన ఉర్రాడ, జామిగూడా గ్రామాలు గుర్రాల తోటకు ఆనుకుని ఉంటాయి. కానీ ఆ గ్రామాలకు వెళ్లాలన్న రోడ్డు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పనులు చాలావరకు పూర్తికావొచ్చాయి. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు…తమకు రోడ్డు మంజూరు చేసి, ఇంతవరకు చేసిన పనిని ఉపాధి హామీ పనులుగా గుర్తించాలని కోరుతున్నారు గిరిపుత్రులు. చూడాలి మరి దీనిపై అధికారయంత్రాంగం ఎలా స్పందిస్తుందో!.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Road construction overnight

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page