19 జిల్లాల్లో  లక్ష్యాలకు మించి ధాన్యం

0 22

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం సేకరణ ఎంతకీ ముగియడం లేదు.  దాదాపుగా 19 జిల్లాల్లో  లక్ష్యాలకు మించి ధాన్యం సేకరణ జరిగింది. నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, నారాయణ పేట, భూపాలపల్లి, గద్వాల్, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జగిత్యాల. అంచనాలకు మించి ఇప్పటికే 83.55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగినా.. మరో 4.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరగాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ లెక్కగడుతోంది. ఎంత ధాన్యం రావచ్చన్న దానిపై జిల్లాల అధికారులు ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగానికి సమాచారమిచ్చారు. ఇందులో వనపర్తి జిల్లా నుంచి 95 వేల టన్నులు, మెదక్‌ 84 వేలు, ఖమ్మం 73 వేలు, నారాయణపేట 56 వేలు, సిద్దిపేట 50 వేలు, నాగర్‌కర్నూలు 50 వేల మెట్రిక్‌ టన్నుల మేర వచ్చే అవకాశాలున్నాయని నివేదించారు. అంటే మొత్తంగా 87.95 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇప్పటికే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు అదనంగా ప్రస్తుత సేకరణకు మరో రూ.2 వేల కోట్లు అవసరం ఉండటంతోపాటు మరో 2 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని లెక్కలేశారు. ఈ నిధుల సేకరణ, గన్నీ సంచుల సేకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిధుల అంశమై మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలోనూ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రస్తావించినట్లు సమాచారం. సేకరణను ఈ నెల 10లోగా ముగించాలని భావించినా, భారీగా ధాన్యం వస్తున్న జిల్లాల్లో ఈ నెల 20 వరకు సేకరణ జరపాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలిసింది.

 

 

- Advertisement -

లారీల కొరత, వానలు, మిల్లుల్లో ఖాళీ కాని ధాన్యం వంటి కారణాలతో సేకరణ కత్తిమీది సాములా మారుతోంది.రాష్ట్రం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో నెలరోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఆవేదనతో అధికారుల కాళ్లావేళ్లాపడుతూ కొన్నిచోట్ల ధాన్యాన్ని అధికారుల ముందటే తగలబెడుతున్నారు. నిస్సహాయ స్థితిలో అన్నదాతలు మిగిలిపోతున్నారు. ఈ సమస్యను సరిగ్గా అంచనా వేయకపోవడం, సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. దీనికితోడు కొన్ని జిల్లాల్లో రైస్‌ మిల్లులు లేవు. ఆ జిల్లా ధాన్యాన్ని పొరుగున ఉన్న జిల్లాలకు కేటాయించారు. ఆ మిల్లర్లు సొంత జిల్లాల్లో సేకరణ పూర్తయితే తప్ప.. మరో జిల్లా నుంచి ధాన్యం తీసుకోవడంలేదని సమాచారం. వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండటానికి కనీసం గన్నీ బ్యాగులనూ సమకూర్చడం లేదని అంటున్నారు. ఈక్రమంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంట కోసం తెచ్చిన అప్పులు చెల్లించలేక, కౌలు ఇవ్వలేక నానా అవస్థలు పడుతున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Grain beyond targets in 19 districts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page