తడి, పొడి చెత్తబుట్టలు మాయం

0 22

విజయనగరం ముచ్చట్లు:

 

స్వచ్ఛ పురపాలికలు ప్రభుత్వ ఆశయం. ఇందుకు చెత్త నిర్వహణే కీలకం. దీనిలో భాగంగా పట్టణాల్లో తడి, పొడి చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా పరిశుభ్రతకు పట్టం కట్టాలన్నదే ప్రయత్నం. ఈ లక్ష్యసాధన మాటున అవినీతి చోటు చేసుకుంటోంది. చెత్త శుద్ధిలో చిత్తశుద్ధి కొరవడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు గుత్తేదారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఏజెన్సీలు సరఫరా చేస్తున్న వస్తువుల్లో  నాణ్యత ఏ మేరకు ఉందో పరిశీలించాక బిల్లులు చేయాల్సి ఉన్నా ఇక్కడ ఏదీ లేకుండానే చెల్లింపులు జరిగిపోతున్నాయి. జిల్లాలో విజయనగరం, పార్వతీపురం పురపాలక సంఘాలతో పాటు నెలిమర్ల నగరపంచాయతీలో చెత్త నిర్వహణ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఈ కారణంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణకు బుట్టల పంపిణీకి ఇంకా అడుగులు పడలేదు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ప్రతి ఇంటికీ బుట్టలు కొనుగోలు చేసి అందజేయాలని ఆదేశాలు ఇచ్చినా ప్రతిపాదనల దశ దాటలేదు. మూడు చోట్ల చెత్తశుద్ధి పార్కుల స్థలసేకరణ కొలిక్కి రాలేదు. ఫలితంగా జిల్లాలో కొన్ని పురపాలకసంఘాల్లో చెత్తనిర్వహణ అమలవుతున్నా మరికొన్నింటిలో కార్యాచరణ కొడిగడుతోంది. వీటిలోనూ చెత్తబుట్టల కొనుగోలుకు ఇంకా ప్రతిపాదనలు పంపాల్సి ఉందని ఆయా పురపాలక కమిషనర్లు చెబుతున్నారు.

 

 

 

- Advertisement -

భవిష్యత్తులో కొనుగోలు చేసే చెత్త బుట్టల్లో నాణ్యత ఉండేలా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది.జిల్లాలో నాలుగు పురపాలక సంఘాలు, ఒక నగరపంచాయతీ ఉండగా.. బొబ్బిలి, సాలూరు పట్టణాల్లోనే మాత్రమే ఘన వ్యర్థాల నిర్వహణ అమలవుతోంది. ఇందుకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు చెత్తబుట్టలను కొనుగోలు చేశారు. ప్రతి ఇంటికీ రెండు బుట్టలు చొప్పున సరఫరా చేశారు. ఇవి నాసిరకం కావడంతో వినియోగించకుండానే పగిలిపోతున్నాయి. ఇందులో అవినీతి కారణంగా ప్రభుత్వ ఆశయం నెరవేరకపోగా నిధులు పక్కదారి పట్టాయని చెప్పవచ్చు.బొబ్బిలి పురపాలిక పరిధిలో రెండేసి బుట్టలు అందజేసినప్పటకీ చాల ఇళ్లలో అవి కనిపించడం లేదు. ఇక కొంతమందికి అవగాహన లేకపోవడంతో ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. వీటిని సరఫరా చేసేముందు పట్టణవాసులకు అవగాహన కల్పించాల్సి ఉంది. వీటి ఆవశ్యకత, స్వచ్ఛత ఆశయం గురించి తెలియజేయకుండా ఇష్టారాజ్యంగా అందజేయడంతో ఆశయం పక్కదారి పట్టింది. పైగా బుట్ట ఖరీదు కూడా ఎక్కువేనన్న వాదన వినిపిస్తోంది.. ఆపై నాణ్యత లేకపోవడంతో అధికారుల ఉదాసీనత విమర్శకు దారి తీసింది.‘చెత్తబుట్టలు పాడవుతున్న విషయం మాదృష్టికి రాలేదు.

 

 

 

 

నాసిరకంగా ఉన్న వాటిని గుత్తేదారుకు తిరిగి పంపించి కొత్తవి తెప్పిస్తున్నాం. రవాణాలో కొన్ని దెబ్బతింటున్నాయి. అలాంటివాటిని వెంటనే మార్చుతున్నాం. ప్రభుత్వం గుర్తించిన సంస్థ సరఫరా చేస్తోంది. ఇందులో మా పాత్ర ఏమీ లేదు’ అని చెబుతున్నారు బొబ్బిలి పురపాలక కమిషనర్‌ హనుమంతు శంకరరావు.పట్టణం పరిశుభ్రంగా ఉండాలన్న జీవో 279 అమలుతోనే ఫలితం వస్తుంది. ఈ జీవో ప్రకారం 300 ఇళ్లను ఒక బ్లాకుగా గుర్తించి సిబ్బందిని నియమిస్తారు.. ప్రతి ఇంటికీ ఒక ట్యాగ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజు ఇంటి వచ్చి  చెత్తసేకరించే పారిశుద్ధ్య సిబ్బంది ఈ ట్యాగ్‌ను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం అమలైతే శతశాతం చెత్తసేకరణ జరుగుతుంది. అంతే కాకుండా తడి, పొడి చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉంటుంది.

 

 

 

 

తడి, పొడి చెత్త వేర్వేరుగా బట్టల్లో వేసి మున్సిపల్‌ బండికి ఇచ్చేలా ప్రజలకు అవగాహన పరచాలి. అలా ఇవ్వనివారిని గుర్తించి చైతన్యపరచాలి. ఆ పని చేయాల్సిన ప్రజారోగ్య విభాగం వారే  రెండు పెద్దడబ్బాలు ఇళ్లవద్దకు తీసుకుని వెళ్లి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు వీధుల్లోకి ఒకే డబ్బాను తీసుకురావడం కనిపిస్తోంది. కొన్ని ఇళ్లలో తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చినా వాటిని ఒకేడబ్బాలోనే వేసి కలిపి వేస్తున్నారు. ఆ తర్వాత ఒకచోట పోగు వేసి అందులో నుంచి  కొన్నిరకాలు పొడిచెత్తను వేరుచేసి కంపోస్టుయార్డుకు తరలిస్తున్నారు.‘జీవో 279ను వ్యతిరేకిస్తూ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు పలుమార్లు విధులు బహిష్కరించారు. ఈ నెల ఒకటో తేది నుంచి సమ్మెచేస్తున్నారు. దీనివల్ల ఇంటీంటికీ వెళ్లి చెత్తసేకరణకు విఘాతం కలుగుతోంది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Ate wet, dry trash

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page