సోయా సబ్సిడీ విత్తనాలపై నీలినీడలు

0 20

నిజామాబాద్  ముచ్చట్లు:

 

సోయా సబ్సిడీ విత్తనాల సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ వానాకాలం సీజనులో రైతులకు సరఫరా చేయాల్సిన సోయా విత్తనాల్లో కనీసం సగం కూడా జిల్లాలకు చేరలేదు. మరో వారం రోజుల్లో ఖరీఫ్‌ పనులు ఊపందుకోనున్న నేపథ్యంలో.. ఈసారి పూర్తి స్థాయిలో సోయా సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయలేమని వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. రైతులు తమకు అవసరమైన సోయా విత్తనాలను ప్రైవేటు విత్తన వ్యాపారుల వద్ద కొనుగోలు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి రావాల్సిన ఈ విత్తనాలు లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయాయని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బఫర్‌ నిల్వలు 16,500 క్వింటాళ్లు ఉండగా, మిగిలిన 1.28 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు సరఫరా చేసే బాధ్యతలను తెలంగాణ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, హాకా, ఎన్‌ఎస్‌సీ, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్‌ సంస్థలకు అప్పగించింది. అయితే 1.45 లక్షల క్వింటాళ్లలో ఇప్పటి వరకు సుమారు 80 వేల క్వింటాళ్లు కూడా జిల్లాలకు చేరలేదు. ఒక్క నిజామాబాద్‌ జిల్లానే పరిశీలిస్తే 32 వేల క్వింటాళ్లు సోయా విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపితే కేవలం 19,820 క్వింటాళ్ల మాత్రమే కేటాయించింది.

 

 

 

- Advertisement -

ఇందులో ఇప్పటి వరకు 9,532 క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి.  రాష్ట్రంలో నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా సోయా సాగవుతుంది. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువగా రైతులు ఈ పంటను వేసుకుంటారు. గత వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 4.28 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన వ్యవసాయ విధానంలో ఈ సోయా సాగు విస్తీర్ణాన్ని మూడు లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించిందిఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా సోయా విత్తనాలపై సబ్సిడీని ఇస్తోంది. ఒక్కో క్వింటాలుపై రూ.810 ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుండగా, రైతులు రూ.1,183 చెల్లించాల్సి ఉంటుంది. అయితే సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పూర్తి ధర చెల్లించి విత్తనాలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు విత్తన వ్యాపారులు ధరలను పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Blue shadows on soybean subsidized seeds

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page