రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రణాళికలు

0 13

ఖమ్మం   ముచ్చట్లు:
ఒకప్పుడు రైస్‌ మిల్లులకు ఆలవాలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఇప్పుడు రైస్‌ మిల్లుల కొరత ఏర్పడింది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా జిల్లాకు కనీసం 60 రైస్‌ మిల్లులు, 20 పార్‌బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు అవసరమవుతాయని అధికారుల అంచనా. అవసరమైనన్ని మిల్లులు లేకపోవడంతో ఇతర జిల్లాలో ఉన్న మిల్లులపై ఆధారపడాల్సి వస్తున్నది. అక్కడ ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేసే దాకా ఇక్కడి రైతులు ధాన్యం రవాణా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌కు జిల్లాలో ప్రాధాన్యత ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతో ఈ జోన్‌లో త్వరలో రైస్‌ మిల్లులు, పార్‌ బాయిల్డ్‌ మిల్లులు ఏర్పాటుకానున్నాయి. మిషన్‌కాకతీయ కారణంగా చెరువులు బాగుపడడం, నీటి వనరులు పెరగడంతో ఇప్పటికే దిగుబడులు అధికమొత్తంలో ఉన్నాయి. రానున్న రోజుల్లో సీతారామా ప్రాజెక్టు పూర్తయితే సాగు విస్తీర్ణం పెరగనుంది. దిగుబడులు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయా రంగాల్లో అనుభవం ఉన్న పారిశ్రామిక వేత్తలు, మిల్లర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రతి సీజన్‌లో కనీసం 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది. కానీ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసే మిల్లులు జిల్లాలో అవసరానికి సరిపడా లేకపోవడంతో యంత్రాంగం ఇబ్బంది పడాల్సి వస్తున్నది.పుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటులో అత్యంత కీలకమైన స్థల సేకరణపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ నేతృత్వంతో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు పరిశీలించారు.

ఒకే చోట 250 ఎకరాల స్థలం కోసం అన్వేషిస్తున్నప్పటికీ గ్రామ ఆవాసాలకు దూరంగా, రహదారి సౌకర్యం ఉన్న ప్రాంతాలు పెద్దగా కనిపించడం లేదు. కనీసం 100 ఎకరాలు ఒకే చోట సేకరించడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్‌ నేతృత్వంలో అధికారులు రఘునాధపాలెం మండలం జింకలతండా శివారులోని సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. మూడు గ్రామాలకు కూడలిగా, జిల్లాకేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ భూమి పుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌కు అనువుగా ఉంటుందన్న భావన ప్రస్తుతం అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నది. మరోవైపు 250 ఎకరాల ప్రభుత్వ స్థలం కోసమై అన్వేషణ కొనసాగుతున్నది. అతిత్వరలో పుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు పారిశ్రామిక అభివృద్ధి అధికారులకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్థలం ఎంపిక పూర్తయితే యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం అక్కడ రహదారి సౌకర్యం, తాగునీటి వసతి, విద్యుత్‌ సరఫరా వంటి.. మౌలిక వసతులు కల్పించనున్నది.జోన్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు భూమి అభివృద్ధి చార్జీలతో కలిపి ప్రభుత్వం ఒక ధరను స్థిరీకరించే అవకాశం ఉన్నది. పార్‌ బాయిల్డ్‌ రైస్‌ మిల్లు ఏర్పాటు చేయడానికి కనీసం రూ.10 కోట్ల పెట్టుబడి, రా రైస్‌ మిల్లు ఏర్పాటుకు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల పెట్టుబడి అవసరం ఉన్నది. పుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ పూర్తయితే ఖమ్మం జిల్లాకు దాదాపు రూ.200 కోట్ల విలువచేసే పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉన్నది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కొన్ని కూడా జోన్‌లో నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Plans for setting up of rice mills

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page